ఇస్తాం ఇస్తాం సరే.. ఎప్పుడో డేట్ చెప్పండి బాబులు!

Update: 2020-04-27 23:30 GMT
కరోనావైరస్ కారణంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి.  సినీ పరిశ్రమ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.  దీంతో రోజువారీ సంపాదన మీద ఆధారపడ్డ సినీ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు.  ప్రభుత్వం వైపు నుండి సహాయం అందినప్పటికీ అది సరిపోదు.  దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా క్రైసిస్ ఛారిటికి విరాళాలు ప్రకటిస్తున్నారు.  కొందరు సీసీసీ తో పాటు సిఎం రిలీఫ్ ఫండ్ కూ సహాయం ప్రకటిస్తున్నారు.  అంతా బాగానే ఉంది.. విరాళాలు ప్రకటించిన వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

అయితే ఇక్కడ ఓ మతలబు ఉందట. విరాళాలు ప్రకటించిన వారిలో కొందరు వెంటనే తమ వంతు సాయం అందిస్తుండగా కొందరు మాత్రం 'ఇస్తాం' అని ప్రకటించి పబ్లిసిటీ కొట్టేస్తున్నారట. మరి ఇచ్చేది ఎప్పుడు? అంటే దానికి సమాధానం లేదు.  డొనేషన్ ఇచ్చారు అనగానే.. 'ఇచ్చారు' అని అర్థం కాదు.  మెజారిటీ సందర్భాల్లో అది 'డొనేషన్ ఇస్తామని ప్రకటించారు' అని అర్థం.  మరి ఎప్పుడు ఈ విరాళం నిజంగా ఇస్తారు అంటే... ఓ కిసీకో భీ మాలూమ్ నై!

దీంతో కొందరు ఇండస్ట్రీ సీనియర్లకు చిరాకుపుడుతోందట.  డబ్బు ఇచ్చాకే.. ప్రచారం చేసుకోండి అని కండిషన్ పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఇక్కడ సమస్య ఏంటంటే విరాళం ప్రకటించిన విషయం మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. ఒకవేళ ఓ సెలబ్రిటీ కోటి రూపాయలు ప్రకటించి నెల తర్వాత పది లక్షలే ఇస్తే అప్పుడు ఆ విషయం ఎవరికీ తెలియదు.  అసలు పూర్తిగా ఎగ్గొడితే కూడా బయటవారికి ఎవరికీ తెలియదు.  పారితోషికాలకే ఇక్కడ సరిగా దిక్కుదివాణం ఉండదని.. ఈ విరాళాల సంగతి ఎవరు పట్టించుకుంటారనే ధైర్యంతో ఇలాంటి పనులు కొందరు చేస్తున్నారట.

కొందరేమో.. నెల రోజులు ఆలస్యంగా డబ్బు ఇస్తే నెల రోజుల వడ్డీ కలిసి వస్తుందిగా అనే 'అత్యంత సహజమైన కక్కుర్తి లక్షణం' తో ఆలస్యంగా ఇస్తారట.  వీరు ఇస్తారు కానీ ఎప్పుడో నెల తర్వాత.. లేదా మూడు నెలల తర్వాతనో ఇస్తారు. అప్పట్లోపు వడ్డీ ఆదా చేసుకుంటారు.  ఈ జగజ్జంత్రీలను కంట్రోల్ చెయ్యాలంటే మహా కంత్రీలు అవసరం! విరాళం ప్రకటించిన రెండో రోజు లోపు డబ్బు ముట్టకపోయినా.. చెక్ ఎన్ క్యాష్ అవ్వకపోయినా..  "శ్రీశ్రీశ్రీ జఫ్ఫా గారి విరాళం తూచ్" అని ప్రకటిస్తే సరే. వెంటనే తిక్క కుదురుతుంది!


Tags:    

Similar News