సేవ అంతా పబ్లిసిటీ కోసమేనా సార్లూ?

Update: 2015-12-15 19:30 GMT
చెన్నై వరద బాధితుల్ని ఆదుకోవడానికి మన తెలుగు తారలు చేస్తున్న సాయం బాగానే ఉంది. వారు చేస్తున్న కార్యక్రమాల గురించి.. సోషల్ మీడియాలో - పత్రికలు - టీవీలు - వెబ్ సైట్లలో బోలెడంత ప్రచారం కూడా వస్తోంది. కానీ ఒక వేళ ఈ ప్రచారమే లేకుండా ఉండి ఉంటే మనోళ్లు ఇంత సాయం చేసేవారా అనేది ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న. విరాళాలు ప్రకటించిన వాళ్లలో కొందరు సైలెంటుగా సాయం చేసి తమ పని తాము చేసుకెళ్లిపోతున్నారు. కానీ కొందరు మాత్రం గోరంత సాయం.. కొండంత పబ్లిసిటీ.. అన్న తీరుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

చెన్నైలో మణిరత్నం సతీమణి, ఒకప్పటి నటి సుహాసిని వరద బాధితుల్లో 40 వేల మంది కడుపు నింపారు. కానీ ఆమె అన్నం పెడుతూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోలేదు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. ఆమె చేస్తున్న సాయం గురించి ఆ నోటా ఈ నోటా విని చాలా ఆలస్యంగా మీడియాకు సమాచారం అందింది. ఆ తర్వాత మీడియాలో వార్త వచ్చింది. కానీ అటు తమిళ నటుల్లో.. ఇటు తెలుగు తారల్లో చాలామంది పబ్లిసిటీ పిచ్చితో నామ్ కే వాస్తే సాయం చేస్తుండటం.. దాన్ని ఓ రేంజిలో ప్రచారం చేసుకుంటుండటం చూస్తున్నాం.

సేవా కార్యక్రమాలకు ప్రచారం కూడా అవసరమే.. కానీ ప్రచారమే పరమావధి అయితేనే సమస్య. కొంతవరకు సేవా కార్యక్రమాలకు లభించే ప్రచారం చూసి మరింత మంది ముందుకు వస్తారు అన్నది వాస్తవమే అయినా..సాయం చేయాలనుకున్నవాడికి ఒక్క చెన్నై బాధితుల విజువల్ చాలు, అది చూసి ఇప్పటికే లక్షల మంది సాయానికి ముందుకొచ్చారు. ఈ సినీ తారల్ని చూసి ఇన్ స్పైర్ అయిపోయి డబ్బులు విదిలించేసేవాళ్లు ఎంతమంది? ఒకవేళ సాయం చేశారే అనుకుందాం.. అక్కడ ఎవరో చేస్తున్న సాయానికి వీళ్లు ఇంత హంగామా చేయడం అవసరమా అన్నది ప్రశ్న. పబ్లిసిటీ లేకుంటే మన తారలు ఏ సాయం చేయరు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. మన పరిశ్రమలోనే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత తిండికి కూడా కష్టపడుతున్న పాతతరం కళాకారులు చాలామంది ఉన్నారు. వారి గురించి మీడియాలో వార్తలొచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. మన దగ్గర సాయం కోసం చూస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లనెవరూ ఆదుకోవడానికి ముందుకు రారు. అలా చేస్తే పబ్లిసిటీ రాదు కదా. చెన్నై వరద బాధితులకు సాయం అంటే నేషనల్ లెవెల్లో కవరేజీ ఉంటుంది. కాబట్టే ఈ హంగామా అంతా అంటున్నారు రాజకీయ, సినీ విశ్లేషకులు.

అయితే, కొందరు సినీ పెద్ద మనుషులు (అందరూ కాదు) ఎంత కరకుగా ఉంటారో చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ అవన్నీ బహిరంగ వేదికలపై చెప్పుకోలేం.  ఏళ్లకు ఏళ్లు ఇంట్లో సేవలు చేసే ఇంటి మనుషులకు ఆపత్కాలంలో చిన్న చిన్న సాయాలు చేయని వారు చాలా మందే ఉన్నారు. ఒక్క రాత్రికి లక్షలు నీళ్లు తాగినంత సులువుగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండి పనివాళ్లకు అవసరమైన చిన్న ఆస్పత్రి ఖర్చులు ఈయని వారు ఇండస్ట్రీలో తక్కువేం కాదు.   ప్రచారం వస్తుందంటే.. పరుగెత్తుకు వచ్చి సాయం చేసే ఈ మనుషులకు నిత్యం తమ చుట్టు ఉండే బడుగుజీవుల జీవితాలను ఉద్దరించాలన్న ఆలోచనే రాదు. ఈ సాయాలేమీ లక్షల్లో ఉండవండోయ్! అయినా అనుకున్నంత వీజీ కాదు. మొన్న డిస్కో శాంతి ఓ న్యూస్ ఛానెల్ ఫేమస్ షోలో.. సినిమా జనాలు ఎంత కృత్రిమ రిలేషన్ మెయింటెయిన్ చేస్తారో అక్కరకు రావాల్సిన సమయంలో ఎలా తప్పించుకుంటారో బహిరంగంగానే చెప్పిందిగా! తమాషా ఏంటంటే... ఇండస్ట్రీలో చాలామందికి నచ్చని కొందరు మాత్రం తన వద్ద పనిచేసేవారిని బాగా చూసుకునే మనసున్నోళ్లు. కాబట్టి ఈ చర్చంతా ప్రచారానికి ఎగబాకే కొందరు గురించే!
Tags:    

Similar News