'మంచు'కు 100 రోజుల టెన్షన్: 'మా'లో ఏం జరుగుతోంది?

Update: 2021-11-30 15:30 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. నెలగడిచింది. హనీమూన్ ముగిసింది. ఇప్పుడు గెలిచిన మంచు విష్ణు ముందు సవాళ్లు ఉన్నాయి. దీంతో పనులు ఏవీ అంటూ మంచు విష్ణును ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.

ప్రకాష్ రాజ్ వర్గం తాజాగా మరోసారి టార్గెట్ చేసింది. టీకప్పులో తుఫానుల్లో మా సంఘంలో మరోసారి అలజడి మొదలైంది. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుకు చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధమైంది. మూకుమ్మడి రాజీనామాలు చేసి మంచు విష్ణును ఇరుకునపెట్టేందుకు ఎదురుచూస్తోంది ప్రకాష్ రాజ్ బ్యాచ్.

మంచు విష్ణు 'మా' అధ్యక్ష కుర్చీ నెక్కి వారాలు, నెలలు కూడా గడుస్తున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఇప్పుడు అవి ఏమయ్యాయని అందరూ అడుగుతున్నారు. కష్టకాలంలో నిజంగానే ముందు కొచ్చి నిలబడుతున్నారా? అని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడి కోమాలో ఉన్నప్పుడు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కనీసం పరామర్శించలేదు. వారి కుటుంబం అడిగేదాకా ఆదుకోలేదన్న విమర్శలు వచ్చాయి. కేవలం ట్వీట్ చేసి మంచు విష్ణు మమ అనిపించేశారు.

ఇక ఏపీ సర్కార్ చట్టాలు మార్చి సినిమా పరిశ్రమను దెబ్బ తీస్తుంటే ఇదేంటని నిలదీసే బాధ్యత మా అధ్యక్షుడు, జగన్ బంధువు అయిన మంచు విష్ణుకు లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇక మా అధ్యక్షుడైన తర్వాత కూడా కొన్ని రోజులుగా 'మా' ఆఫీసుకు తాళం వేళ్లాడుతోంది. దీంతో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. పర్సనల్ రీజన్స్ వల్ల మాలోని స్టాఫ్ రావడం లేదని.. 28న మీటింగ్ పెట్టి సిబ్బందిని మార్చే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నాం అంటున్నారు మంచు విష్ణు. అంతే తప్ప 'మా' సభ్యులకు మేము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం.. ఉన్నాం అని క్లారిటీనిస్తోంది విష్ణు టీం.
Tags:    

Similar News