అజ్ఞాతవాసి.. బాహుబలి-2ను కొట్టగలడా?

Update: 2018-01-07 06:30 GMT
‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైనపుడు ఆ సినిమా సాధించిన వసూళ్ల రికార్డులు ఇప్పుడిప్పుడే బద్దలు కావని.. స్టార్లందరూ ఈ రికార్డుల్ని అధిగమించడానికి చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని భావించాం. కానీ రెండేళ్లు తిరిగేసరికి ఆ రికార్డులు చాలా వరకు చెదిరిపోయాయి. ఐతే ఇంతలోనే ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చింది. ఊహకందని స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లు చూసి దేశమంతా విస్తుబోయింది. ఈ రికార్డులు కూడా చాలా ఏళ్లు నిలుస్తాయనే అంచనా వేశారంతా. కానీ అందుకు ఛాన్స్ ఇవ్వనంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అతడి కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’.. ‘బాహుబలి-2’ కలెక్షన్ల రికార్డులు కొన్నయినా బద్దలు కొట్టడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.

‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘కాటమరాయుడు’ లాంటి డిజాస్టర్లతోనూ రూ.60 కోట్ల షేర్ సాధించిన ఘనుడు పవన్ కళ్యాన్. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఏస్ డైరెక్టర్‌ తో జతకడితే ఆ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది..? అందులోనూ ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వాళ్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అందుకే ఈ చిత్రం మొదలైపుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో జోష్ లేదు. దసరా తర్వాత పెద్ద సినిమాల సందడే లేదు. గత రెండు నెలల్లో వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. బాక్సాఫీస్ డల్లుగా ఉంది. ప్రేక్షకులు ఓ పెద్ద - మంచి సినిమా కోసం ఆవురావురుమని ఉన్నారు. ఇలాంటి తరుణంలో ‘అజ్ఞాతవాసి’ వస్తోంది, అది కూడా సంక్రాంతి సీజన్లో.

తెలుగు రాష్ట్రాల్లోని 95 శాతం థియేటర్లలో ఈ చిత్రాన్నే వేసేయబోతున్నారు. ముందు రోజు రాత్రి నుంచే భారీ ఎత్తున బెనిఫిట్ షోలు పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వారం రోజుల పాటు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు కూడా అనుమతి ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ కూడా స్పెషల్ షోలకు అనుమతిస్తే ఇక వసూళ్ల ప్రతాపం ఎలా ఉంటుందో చెప్పేదేముంది..? 12న ‘జై సింహా’ రావడానికి ముందు తొలి రెండు రోజుల్లోనే ‘అజ్ఞాతవాసి’ వసూళ్లు ఊహకందని స్థాయిలో ఉండే అవకాశముంది. రూ.70-80 కోట్ల మధ్య షేర్ రావడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. అసలే లాంగ్ వీకెండ్.. పైగా సంక్రాంతి సెలవులు.. అందులోనూ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక దీనికి పాజిటివ్ టాక్ వస్తే ఇక వసూళ్లు ఎలా ఉంటాయో చెప్పాలా? కాబట్టి ‘బాహుబలి-2’ తెలుగు వెర్షన్ డే-1.. వీకెండ్ వసూళ్ల రికార్డుల్ని ‘అజ్ఞాతవాసి’ దాటడానికి అవకాశాలు లేకపోలేదు. అలాగే కొన్ని జిల్లాల వరకు ‘బాహుబలి-2’ ఓవరాల్ వసూళ్లను కుూడా దాటినా దాటొచ్చు. కాకపోతే సినిమాకు  పాజిటివ్ టాక్ రావడం కీలకం. అలా వస్తే మాత్రం ‘అజ్ఞాతవాసి’ ఫుల్ రన్లో రూ.150 కోట్ల దాకా షేర్ రాబట్టి సరికొత్త నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పేందుకు ఆస్కారముంది.


Tags:    

Similar News