శంకర్ సినిమాలో చరణ్ పాత్రను డిజైన్ చేసిన తీరే వేరట!

Update: 2021-11-01 00:30 GMT
సౌత్ ఇండియా సినిమాను ప్రపంచపటానికి పరిచయం చేసిన దర్శకుడు శంకర్. పాన్ ఇండియా సినిమా అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది గానీ .. అంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ అవే. ఆయన సినిమాలు ఒక భాషలో ప్రేక్షకులను మెప్పించి మరో భాషలో అలరించని సందర్భాలు దాదాపుగా కనిపించవు. ఎందుకంటే ఎవరూ కూడా శంకర్ సినిమాను ఇతర భాషకి చెందిన సినిమాగా చూడరు. ఆయన ఎంచుకునే కథా వస్తువు కూడా అలాగే ఉంటుంది. అందువల్లనే అన్ని ప్రాంతాలవారికి కనెక్ట్ అవుతుంది.

శంకర్ టైటిల్ దగ్గర నుంచి ప్రతి అంశానికి చాలా ప్రాధాన్యతనిస్తాడు. ముఖ్యంగా ఆయన హీరోల పాత్రలను డిజైన్ చేసే తీరు కొత్తగా ఉంటుంది. భారతీయుడు .. అపరిచితుడు .. ఐ .. రోబో.. వంటి సినిమాలు అందుకు  ఉదాహరణగా కనిపిస్తాయి.    కథాకథనాలు .. పాటలు .. చిత్రీకరణ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఆయన ప్రతి సినిమాను చూపించవచ్చు. అలాంటి శంకర్ ..   చరణ్ హీరోగా ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఇందులో చరణ్ ఎలా కనిపించనున్నాడా అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది.

ఇంతవరకూ కనిపిస్తూ వచ్చిన లుక్స్ కి పూర్తి భిన్నంగా చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. చరణ్ పాత్రను శంకర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఆ పాత్ర లుక్ మాత్రమే కాదు .. తెరపై అది ప్రవర్తించే తీరు కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెరపై ప్రేక్షకులు ఒక కొత్త చరణ్ ను చూస్తారట.   చరణ్ తో శంకర్ సినిమా అంటే ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో, ఈ సినిమా అందుకు ఎంతమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.

కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50 సినిమా. చూస్తుంటే ఈ సినిమా నుంచే దిల్ రాజు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి .. వంశీ పైడిపల్లి సినిమాలకి నిర్మతగా ఆయన పేరే వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగును జూన్ నాటికి పూర్తి చేయాలనే దిల్ రాజు షరతుకు ఒప్పుకునే శంకర్ రంగంలోకి దిగింది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కైరా అద్వానీ  కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్ .. అంజలీ .. సునీల్ .. నవీన్ చంద్ర తడితరులు కనిపించనున్నారు.     
Tags:    

Similar News