షాకింగ్‌.. చిరంజీవికి ఇష్ట‌మైన ఇద్ద‌రు నాయ‌కులు వీరే!

Update: 2022-10-13 04:56 GMT
ఈ ఏడాది ఆచార్య‌తో డిజాస్ట‌ర్‌ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌తో సూప‌ర్ హిట్ కొట్టారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చేతిలో బాబీ ద‌ర్శ‌కుడిగా వ‌స్తున్న వాల్తేరు వీర‌య్య‌, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న భోళా శంక‌ర్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండింటిలో మొద‌ట వాల్తేరు వీర‌య్య‌ను చిరు ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి లేదా వ‌చ్చే వేసవిలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ సినిమాలు కాకుండా మ‌ళ‌యాలంలో మమ్ముట్టి న‌టించగా విజ‌యం సాధించిన భీష్మ ప‌ర్వం రీమేక్‌లోనూ చిరంజీవి న‌టిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా ద‌స‌రా కానుక‌గా వ‌చ్చిన గాడ్ ఫాద‌ర్ ఇప్ప‌టికే రూ.100 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. అనుకున్నంత స్థాయిలో ప్రచారం చేయ‌క‌పోయినా ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డం విశేషంగానే చెప్పాలి. ముఖ్యంగా.. రాజ‌కీయాల‌కు నేను దూరంగా ఉన్నా నా నుంచి అవి దూరం కాలేదు అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదే గాడ్ ఫాద‌ర్‌లో రాజకీయాలు, మీడియాపై ప‌లు డైలాగులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో తాజాగా గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా పూరి మీకు ఇష్ట‌మైన రాజ‌కీయ‌న నేత‌లు ఎవ‌రు అని అడ‌గ్గా చిరు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాత జనరేషన్లో చాలా మంది మహానుభావులు ఉన్నారంటూ చెప్పారు. వారు అనేక పార్టీల్లో ఉన్నవారని వివరించారు.

అయితే త‌న‌కు ఇష్ట‌మైన రాజ‌కీయ నాయ‌కులు.. మాజీ ప్ర‌ధాన‌మంత్రులు లాల్ బ‌హదూర్ శాస్త్రి, అటల్ బిహారి వాజ‌పేయి అని తెలిపారు. వీరిద్ద‌రి హ‌యాంలోనే దేశంలో మంచి ప‌నులు జ‌రిగాయ‌న్నారు.

దీంతో మెగాస్టార్ అభిప్రాయంపై స‌ర్వ‌త్రా నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ ప్ర‌ధాన‌మంత్రులు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ న‌ర‌సింహారావు, మ‌న్మోహ‌న్ సింగ్‌ వంటివారిని కూడా కాద‌ని చిరంజీవి.. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, అట‌ల్ బిహారి వాజ్‌పేయి పేర్లు చెప్ప‌డం విశేషం. అంతేకాకుండా ప్ర‌స్తుత త‌రంలో త‌న‌కు ఇష్ట‌మైన రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రూ లేర‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి చిరంజీవి.. కేంద్రంలో మ‌న్మోహ‌న్ సింగ్ మంత్రివ‌ర్గంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పేరును చిరు చెప్ప‌కపోవ‌డం విశేషం. ఇక చిరుకు ఇష్ట‌మైన లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి కూడా కాంగ్రెస్ ప్ర‌ధాన‌మంత్రే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను ఆ పార్టీ దూరం పెట్టింద‌ని అంటారు.  

నెహ్రూ మ‌ర‌ణానంతరం భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌య‌మే ప్ర‌ధానిగా ఉన్న ఆయ‌న జై జ‌వాన్‌, జై కిసాన్ నినాదంతో ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోయారు. అలాగే 1965లో పాకిస్థాన్‌తో జ‌రిగిన యుద్ధంలో ఆ దేశం పీచ‌మ‌ణిచారు. తాష్కెంట్ ఒప్పందం కోసం ర‌ష్యా వెళ్లి అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించారు. ఇది హ‌త్యేన‌ని అత్య‌ధికులు న‌మ్ముతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇక అట‌ల్ బిహారి వాజ‌పేయి ఐదేళ్లు ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్న తొలి కాంగ్రేసేత‌ర ప్ర‌ధానిగా రికార్డు సృష్టించారు. పోఖ్రాన్‌లో అణు పరీక్ష‌లు విజ‌య‌వంతంగా జ‌రిపి శత్రు దేశాల్లో గుండెల్లో వ‌ణుకుపుట్టించారు. మంచి వాగ్ధాటి ఉన్న నేత‌గా, క‌విగా, సున్నిత హృద‌యుడిగా, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా అట‌ల్ బిహారి వాజ‌పేయి గుర్తింపు పొందారు.

ఈ నేప‌థ్యంలో చిరంజీవి.. అట‌ల్ బిహారి వాజ‌పేయి, లాల్ బ‌హదూర్ శాస్త్రిల హ‌యాంలోనే దేశంలో మంచి ప‌నులు జ‌రిగాయంటూ ప్ర‌శంసించారు. మ‌న్మోహ‌న్ సింగ్ ప‌దేళ్లు ప‌ద‌విలో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎనిమిదేళ్లు ప్ర‌ధానిగా ఉన్నారు. మ‌రో రెండేళ్లు ఉంటారు. అయినా వీరెవ‌రి పేర్లు చిరు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.

మ‌రోవైపు ఇటీవ‌ల త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చిరంజీవి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. త‌న త‌మ్ముడిని ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకుంటున్నాన‌ని ఆకాంక్షించారు. ప‌వ‌న్ కు నిజాయితీ, నిబ‌ద్ధ‌త ఉన్నాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో చిరు తాజా వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

బీజేపీ చిరంజీవిని త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని ఆశిస్తున్న వేళ బీజేపీ నేత అయిన అట‌ల్ బిహారి వాజ‌పేయి అని చిరంజీవి చెప్ప‌డం విశేషం. బీజేపీ నేతలు ఇప్పటికే చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యల‌తో మరోసారి ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News