గుణ‌పాఠం ఇండ‌స్ట్రీకా.. చ‌ర‌ణ్ కా చిరు?

Update: 2015-10-25 11:47 GMT
ఒకే త‌ర‌హా సినిమాలు తీయ‌టం కొంత‌మంది అగ్ర‌హీరోల‌కు అల‌వాటుగా మారింది. ఏ మాత్రం కొత్త‌ద‌నం అన్న‌ది లేకుండా బూజుప‌ట్టిన పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీస్తూ ప‌రీక్ష పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి హోరులో కంచెలాంటి భిన్న‌మైన సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌టం.. దానికి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌టం మంచి ప‌రిణామంగా చెబుతున్నారు.

కంచె సినిమాపై మెగాస్టార్ చిరు అభినంధించ‌టం తెలిసిందే. కంచెను పొగిడే క్ర‌మంలో ఈ సినిమా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఒక గుణ‌పాఠం కావాల‌న్న మాట‌ను చెప్పారు. రోటీన్ సినిమాలు కాకుండా ప్ర‌యోగాత్మ‌క సినిమాలు తీయాల‌న్న మాట‌ను చెప్పుకొచ్చారు. మాట‌లు చెప్పేందుకు మాత్ర‌మేన‌ని చిరు మాట‌లు చూస్తే తెలుస్తుంది. ఇన్ని మాట‌లు చెబుతున్న చిరంజీవి.. త‌న కొడుకు రాం చ‌ర‌ణ్ విష‌యంలో ఎందుకు కొత్త‌కు అవ‌కాశం ఇవ్వ‌టం లేదు.

నాట్‌.. నాట్ సెంచ‌రీల నాటు సినిమాను త‌ల‌పించేలా తాజాగా తీసిన బ్రూస్ లీ సినిమా సంగ‌తే తీసుకుందాం. ఈ సినిమా చూసిన వారికి.. దీని కోసం దాదాపు రూ.50కోట్ల‌కు పైనే ఖ‌ర్చు అయ్యిందంటూ నోట మాట రాని ప‌రిస్థితి. ఇంత భారీగా ఖ‌ర్చు పెట్టిన సినిమాలో ఏమైనా విష‌యం ఉందా? అంటే శేష ప్ర‌శ్నే. ఇక‌.. అనుభూతి ఉందా అంటే అదో బ్ర‌హ్మ‌ప‌దార్థ‌మే. క‌మ‌ర్షియ‌ల్ కొల‌త‌ల‌తో తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్స్‌పీసు ద‌గ్గ‌ర ఎంత‌లా చ‌తికిల ప‌డిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఇంట్లోనే మొనాట‌నీ ఫ్యాక్ట‌రీ పెట్టుకొని బ‌య‌ట‌కేమో గుణపాఠం కావాల‌న్న మాట‌లు చెబితే ఏం బాగుంటుంది. ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌తో పాటు.. ఖ‌ర్చుకు క‌ళ్లెం వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆద‌ర్శం మాటల్లోనే కాదు.. చేత‌ల్లో కూడా చేసి చూపిస్తే మెగా అభిమానుల‌కు అంత‌కు మించి కావాల్సిందేముంటుంది? ఇంత‌కీ చిరు అన్న‌ గుణ‌పాఠం మాట ఇండ‌స్ట్రీకా? చెర్రీకా..?
Tags:    

Similar News