సావిత్రి గారి మందు గురించి అడిగేసిన చిరు

Update: 2018-05-13 08:46 GMT
మహానటి విజయాన్ని వైజయంతి సంస్థ మాత్రమే కాక సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక నటీమణి బయోపిక్ రూపొందటం ఒక విశేషం అయితే అది అందరి అంచనాలు మించి ఘన విజయం సాధించడం సావిత్రి గారికి ఇచ్చిన నిజమైన నివాళి అందరు భావిస్తున్నారు. నిన్న యూనిట్ కు జరిపిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి కూడా ఎంత ఎగ్జైట్ అయ్యారో చూసాం. ఆ సందర్భంలోనే సావిత్రి గారిని మద్యానికి బానిసైనట్టు చూపడం పట్ల చిరు అనుమానం వ్యక్తం చేస్తూ అసలు అలా తీయటం అవసరమా అనేలా పక్కనే ఉన్న దర్శకుడు నాగ అశ్విన్ ను నేరుగా అడిగేయటంతో అందరూ ఆశ్చర్యపోయారు. దానికి అశ్విన్ వినయంగా బదులు చెబుతూ సావిత్రి గారి జీవితాన్ని తాగుడు అనే వ్యసనాన్ని వేరు చేసి చూపించలేమని ఆవిడ కూతురు విజయ చాముండేశ్వరి గారి దగ్గర సమాచారం తీసుకునే ఇవి తీసానని చెప్పాడు.

సావిత్రి గారి గురించి ఎన్నో ప్రచారాలు జరిగిన నేపధ్యంలో వాటికి చెక్ పెడుతూ ప్రతిదీ క్షుణ్ణంగా చూపాలనే ఇలా చేయటం జరిగిందని చాలా సహజంగా వచ్చిన ఆ సీన్స్ ని చూసి కుటుంబ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారని నాగ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అందరి మనసులో ఉన్న సందేహాలను చిరు పబ్లిక్ గా క్లారిటి ఇప్పించేసాడు. రిలీజ్ కు ముందు వరకు జెమిని గణేషన్ సావిత్రి గారికి మందు అలవాటు చేయటం అది లేకుండా ఉండలేని స్థితికి ఆవిడ చేరుకోవడం లాంటివి అశ్విన్ ధైర్యంగా చూపిస్తాడా లేదా అను సంశయం అందరిలోనూ ఉంది. కాని వాటికి చెక్ పెడుతూ సావిత్రి గారి పిల్లల సహాయంతో నాగ అశ్విన్ అన్ని స్పష్టంగా చూపించాడు. ఇదే ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఒకవేళ ఈ అంశాన్ని స్పృశించక పోతే ఈపాటికే విమర్శల బాణాలు దూసుకువచ్చేవి. ఏదైతేనేం నిజాయితీగా సావిత్రి గారి జీవితాన్ని వెండితెరపై పరిచిన అశ్విన్ ప్రతిభ ఏకంగా మెగాస్టార్ నే నీతో సినిమా చేయాలని ఉందనే దాకా తెచ్చింది. టైం ఇస్తే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తానంటున్న అశ్విన్ కనక నిజంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కిస్తే మెగా ఫాన్స్ కు అంత కన్నా కిక్కిచ్చే న్యూస్ ఏముంటుంది.

Tags:    

Similar News