మా నాన్న నన్ను రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారు: చిరూ

Update: 2022-09-01 04:02 GMT
కొత్త దర్శకులను పరిచయం చేస్తూ .. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ 'ఫస్టు డే ఫస్టు షో' సినిమా రూపొందింది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీయేజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "ఈ సినిమాతో ఏడిద నాగేశ్వరరావు గారి మనవరాలు శ్రీజ నిర్మాతగా పరిచయమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఇండస్ట్రీకి ఆడపిల్లలు వస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని శాఖల్లోను ఆడపిల్లలు రావాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆడపిల్లలకు ఎంతో గౌరవం లభిస్తోంది. ఇతర భాషలకి చెందిన హీరోయిన్స్ ఈ స్థాయి గౌరవం తమకి ఎక్కడా దొరకడం లేదనే చెబుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేయడానికి వాళ్లంతా ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలాంటి పరిశ్రమలోకి శ్రీజ అడుగు పెట్టడం అభినందించదగిన విషయం.

అందరి మాదిరిగానే ఫస్టు డే ఫస్టు షో అనుభవం ఒకటి నాకు కూడా ఉంది. కాకపోతే పరువు పోతుందని ఇంతవరకూ నేను ఎక్కడా చెప్పలేదు.

"నెల్లూరులో నేను ఏడో క్లాసో  .. ఎనిమిదో క్లాసో చదువుతున్నాను. అప్పుడే ఎన్టీఆర్ గారి 'రాము' వచ్చింది. మా చుట్టాలబ్బాయి పూర్ణ నన్ను నేల టిక్కెట్టుకు ఆ సినిమాకి తీసుకుని వెళ్లాడు. అప్పటి వరకూ మా నాన్నగారు మాకు కుర్చీలో కూర్చుని చూడటమే అలవాటు చేశారు. అప్పుడు నాగబాబు ఇంకా చిన్నపిల్లవాడు. క్యూ ఆగిపోవడంతో ఊపిరి ఆడలేదు.

అలాగే తోసుకుంటూ వెళ్లి టిక్కెట్టు తీసుకుని బయటికి వచ్చేసరికి, అంతకు ముందు షో చూసి నాన్నగారు బయటికి వచ్చారు. ఆయన వెనకాలే మా అమ్మగారు ఉన్నారు.

నాగబాబు నలిగిపోయి వెర్రి ముఖం వేసుకుని చూస్తున్నాడు. నేల టిక్కెట్టుకు వెళతారా అనేసి అక్కడే పట్టుకుని కొట్టేశారు. సినిమా హాల్ దగ్గర నుంచి మా ఇంటివరకూ రోడ్డు పై కొట్టుకుంటూనే తీసుకుని వెళ్లారు. ఈ రోజుకీ 'రాము' సినిమా పేరు చెబితే వెంటనే ఆ సంఘటన గుర్తుకు వస్తుంది .. వణుకు పుడుతుంది" అంటూ చెప్పుకొచ్చారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News