మంచిని మైక్ లో చెడును చెవి లో చెప్పాలి!

Update: 2020-01-02 10:55 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) 2020 డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ర‌సాభాస‌గా సాగ‌డంపై సినీ పెద్ద‌లు సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌యివేటు హోట‌ల్లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి - కృష్ణం రాజు- మోహ‌న్ బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇక ఈ వేదిక‌పై పెద్ద‌లంతా కాస్త ఎమోష‌న్ అవ్వ‌డం మా అంత‌ర్గ‌త క‌ల‌హాల్ని వారించే ప్ర‌య‌త్నం చేయ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ముఖ్యంగా హీరో రాజ‌శేఖ‌ర్ ఎమోష‌న‌ల్ అవ్వ‌డం ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధానం గా హైలైట్ అయ్యింది. ఆయ‌న‌ను వారిస్తూ చిరు- మోహ‌న్ బాబు వంటి ప్ర‌ముఖులు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.

ఇక వేదిక‌ పై హీరో రాజ‌శేఖ‌ర్ త‌న ఎమోష‌న్ ని మాట‌ల్లో బ‌య‌ట పెట్టేస్తున్న క్ర‌మంలో వేదిక‌పై ఆశీనులై ఉన్న మెగాస్టార్ మైక్ అందుకుని .. రాజ‌శేఖ‌ర్ ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వారించారు. మంచిని మైక్ లో చెడును చెవిలో చెప్పాలి! అంటూ త‌న‌దైన శైలిలో వారించే ప్ర‌య‌త్నం చేశారు. ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే అంత‌ర్గ‌తంగా ప‌రిష్కరించుకుందామ‌ని అన్నారు. అంతేకాదు ఇంటి గుట్టును ఇలా మీడియా ముందు బ‌య‌ట పెట్టేయ‌డం స‌రికాద‌ని సీరియ‌స్ అయ్యారు. పెద్ద‌ల మాట‌ను విన‌రా! అంటూ చిరు కాస్త ఆవేద‌న‌గానే అన‌డం మా మెంబ‌ర్స్ లో ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కొచ్చింది.

ఈ కార్యక్రమంలో న‌టుడు- నిర్మాత మురళీ మోహన్- రచయిత గోపాలకృష్ణ- మా ప్రస్తుత అధ్య‌క్షుడు వీకే నరేష్- జీవితా రాజశేఖర్ తదిత‌రులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ``నూతన సంవత్సరమే కాకుండా కొత్త దశాబ్దం లోకి అడుగు పెడుతున్నాం. ఈ దశాబ్దం అంతా గొప్పగా సాగాలనే సంకల్పంతో ముందుకెళ‌దాం. ఈ దశాబ్దం మొత్తం ఏం చేయాలో భవిష్యత్ ప్రణాళిక ను రచించుకోవాలి. స్వప్రయోజనాలను పక్కన పెట్టి కళామ తళ్లికి సేవ చేసుకోవాలి. ఈ డైరీని 20 సంవత్సరాలు గా ముద్రిస్తూనే ఉన్నాం`` అని అన్నారు.

ఓ విమాన ప్ర‌యాణంలో ప్రయాణిస్తుండగా ఆర్టిస్టుల అసోసియేషన్ గురించి మురళీమోహన్ తో చర్చించి నిర్ణ‌యించుకున్నామ‌ని నాటి విష‌యాన్ని గుర్తు చేశారు చిరు. తాను వ్యవస్థాపక అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ప్రారంభించాల‌ని అనుకుంటే.. త‌న‌నే అధ్య‌క్షుడిగా ఉండాల్సిందిగా ముర‌ళీ మోహ‌న్ కోరార‌ని వెల్ల‌డించారు. తాన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉండి సంఘాన్ని న‌డిపించారు. అటుపై అంద‌రి స‌హ‌కారంతో ముందుకు వెళ్లామ‌ని.. నెమ్మ‌దిగా ఆర్టిస్టుల ఫోన్ నంబర్లతో కూడిన డైరీని ఏర్పాటు చేసామ‌ని.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే ఆర్టిస్టులకు ఉపయోగపడేలా డైరీని రూపొందించామ‌ని తెలిపారు. న‌టీన‌టుల‌కు పెన్షన్లు- ఇన్సూరెన్స్ ఇస్తున్నామ‌ని.. దివంగత విజయనిర్మల పేరిట కొనసాగిస్తున్న పెన్షన్ పథకాన్ని కొన‌సాగించాల‌ని కోరారు.


Tags:    

Similar News