నిజం నిల‌క‌డ‌గానే తెలుస్తుంద‌న్నది నిజ‌మైంది!-చిరు

Update: 2022-10-16 00:30 GMT
పరిశ్ర‌మ‌లో నిష్క‌ల్మ‌శ‌మైన .. నిష్క‌ళంక‌మైన జీవితం మెగాస్టార్ చిరంజీవిది. ఆయ‌న దాన‌ధ‌ర్మాలు సేవా కార్య‌క్ర‌మాల గురించి ఇప్పుడే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ద‌శాబ్ధాలుగా బ్ల‌డ్ బ్యాంక్ - ఐబ్యాంక్ ల‌తో అసాధార‌ణ‌మైన సేవాకార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. కానీ ఆయ‌న ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన క్ర‌మంలో బ్ల‌డ్ బ్యాంక్ లో అవినీతి జరుగుతోందంటూ రాజ‌కీయంగా బుర‌ద‌జ‌ల్లారు. ప్ర‌త్య‌ర్థులు చిరంజీవి కి అవినీతిని అంట‌గ‌ట్టి వ్య‌క్తిత్వాన్ని తూల‌నాడ‌డం ప్రారంభించారు.

కానీ వేటికీ వెర‌వ‌క కించిత్ కూడా భంగ‌ప‌డ‌క చిరు త‌న ప‌ని తాను చేసుకుపోయారు. ఉద్రేక‌ప‌డి అన‌వ‌స‌ర ఘ‌ర్ష‌ణ‌ల జోలికి వెళ్ల‌లేదు. సౌమ్యంగా ఉండ‌డంలో చిరుకి సాటి లేరు ఎవ‌రూ అని నిరూపించారు.

తాజా ఇంట‌ర్వ్యూలో నాటి సంఘ‌ట‌న‌ల గురించి త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల గురించి చిరు త‌న‌దైన శైలిలో పంచ్ లు వేస్తూ ముచ్చ‌టించారు. ``నిజం నిలకడగా తెలుస్తుందన్న ఫిలాసఫీ నాది.

ఒకప్పుడు నన్ను తిట్టావ్‌ కదా.. నీతో నేనెందుకు మాట్లాడాలి? అనే స్వ‌భావం నాది కాదు!`` అని చిరంజీవి అన్నారు. నా తప్పు లేకుండా ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. నేను రాజకీయాల్లోకి వెళ్తానని తెలియ‌గానే.. బ్లడ్ బ్యాంక్ స‌హా నా వ్యక్తిగత జీవితంపై చాలామంది విమర్శించారు. వాటిలో ఏదీ నిజం కాదు. నిజం కానీ విషయాలపై నేనెందుకు ఉలిక్కిపడాలి? ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో.. వారికి నిజానిజాలు తెలిశాయి. కోర్టుల ద్వారానో.. అంతరాత్మల ద్వారానో తప్పు తెలుసుకుని ఇప్పుడు మ‌ళ్లీ నాతో స్నేహంగా ఉంటున్నారు`` అని చిరు అన్నారు.

ఒక‌ప్పుడు తిట్టావ్.. నీతో ఎందుకు మ‌ట్లాడాలి? అనే తత్వం నాది కాదు. బ్యాంక్ ఖాతాలో 1 ప‌క్క‌నే ఎన్ని సున్నాలున్నాయ‌న్నది కాదు.. ఎంత‌మందికి చేరువ‌య్యాను అన్న‌దే ముఖ్యం. నన్ను ఎద్దేవ చేసిన వారు ఎదురుపడినా ఆలింగనం చేసుకోవడమే నా ఫిలాసఫీ. ఎక్కువమంది మనసు గెలుచుకున్నవాడిలో నేను ఒకడిని. తప్పు చేయను! అన్న గట్‌ ఫీలింగ్‌ ఉన్న నాకు.. ఎవరు ఎలా మాట్లాడినా అది వాళ్ల తప్పే అవుతుంది కానీ నా తప్పుకాదు. నేను తప్పు చేస్తే అందరిముందే పొరపాటయిందని ఒప్పుకుంటా’`` అని చిరు తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు.

మెగాస్టార్ న‌టించిన గాడ్ ఫాద‌ర్ ఘ‌న‌విజ‌యం సాధించిన నేప‌థ్యంలో క్రిటిక్స్ స‌హా ప‌లు మీడియాల‌తో చిరు ముచ్చ‌టించారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న పై ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మాట్లాడారు. చిరు ప్ర‌స్తుతం వాల్టేరు వీర‌న్న‌- భోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టిస్తున్నారు.


Tags:    

Similar News