టీజర్ టాక్: నాలుగు పాత్రల మోడరన్ చిత్రలహరి

Update: 2019-03-13 04:10 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'చిత్రలహరి' టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది.  కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజూ సరసన కళ్యాణి ప్రియదర్శన్.. నివేద పేతురాజ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.  టీజర్ డ్యూరేషన్ ఒక నిముషం 8 సెకన్లే అయినా లీడ్ పాత్రలను వారి పాత్రచిత్రణలను చూపించేశాడు దర్శకుడు.  అలా అని ప్లాట్ ఏమీ రివీల్ చేయలేదు లెండి.  ఈ టీజర్ దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయింది.

'చిత్రలహరి అప్పట్లో దూరదర్శన్లో ప్రతి శుక్రవారం వచ్చే ప్రోగ్రామ్.  ఈ చిత్రలహరి 2019 లో ఒక ఫ్రైడే రిలీజ్ అవబోయే సినిమా. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు' అంటూ ఇంట్రో ఇచ్చారు సుక్కు మాస్టారు.  నాలుగు పాత్రలు చూపించారు. 1)నివేద పేతురాజ్ 2)కళ్యాణి ప్రియదర్శన్ 3) సునీల్ 4) నాలుగోది అసలు పాత్ర అట..  ఎవరంటే హీరో తేజు.  ఇక కాస్త డీటెయిల్డ్ గా చెప్పుకుంటే.. మగాళ్ళ పట్ల అసలేమాత్రం సదభిప్రాయం లేదని యువతి నివేద. మగాళ్ళంతా 'ఇంతే' అని చెప్పే సమయంలో ఆ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే 'అపరిచితుడు' సినిమాలోని గరుడ పురాణం శిక్షలను మగజాతికి వేయించడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తోంది.  రెండో క్యారెక్టర్ కళ్యాణి కాస్త ఫన్నీగా ఉంది.. 'నాగురించి నేను చెప్పాలంటే.. ఐ నీడ్ సమ్ టైమ్.. డిస్కస్ చేయాలి' అంటోంది.  మూడో పాత్ర కమెడియన్ సునీల్ ది.  వైన్ షాప్ కౌంటర్లో 'ఐదు చిల్లర లేదు' అంటూ మూంగ్ దాల్ ప్యాకెట్ ఇస్తే.. దానికి కౌంటర్ గా మరో మూంగ్ దాల్ ప్యాకెట్ ను షాప్ అతనికి ఇచ్చి 'నిన్న నువ్విచ్చిందే.. పదియ్యి' అంటాడు సునీల్.  నెక్స్ట్ షాట్ లో 'దీవెన' అనే టీవీ ఛానల్ లో ప్రబోధకుడి అవతారంలో సునీల్.. సూటు బూటు వేసుకొని స్పీచ్ ఇస్తుంటాడు.

ఇక ఫైనల్ గా అసలు వ్యక్తి.. తేజు.  పేరు విజయ్ కానీ విజయం అసలు లేని వ్యక్తి..  అది ఎప్పుడుస్తుందా అని ఆశగా కాస్త నిరాశతో ఎదురు చూసే వ్యక్తి.  సరిగ్గా ఇలాంటి డైలాగ్ చెప్పే సమయంలోనే పవర్ కట్ అయ్యి.. విజయ్ చుట్టూ చీకటి అలముకుంటుంది.   'బాధ పడకు బాబాయ్ నీకూ ఓ మంచిరోజొస్తుంది' అని 'సుదర్శన్ ఓదార్పునిస్తే తేజు దానికి సమాధానంగా 'ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మని చెప్పు బాబాయ్.. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను' అంటాడు.

ఈ  మోడరన్ 'చిత్రలహరి'లో నాలుగు పాత్రలైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. మరి వీరి మధ్య కథ ఏంటనేది చూడాలి.  దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.   ఓవరాల్ గా టీజర్ ను చూస్తుంటే ఓ మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ అనే ఫీల్ కలుగుతోంది.  ముఖ్యంగా అసలు పాత్ర దిగాలుగా.. కష్టాలతో ఉండడం డిఫరెంట్ గా ఉంది.   ఈసారి విజయ్ కి విజయం.. అరడజను ఫ్లాపుల తర్వాత తేజుకు సక్సెస్ ఒకేసారి వస్తాయేమో.  ఆలస్యం ఎందుకు.. విజయ్ బ్యాడ్ లక్ మనకు తగిలి సడెన్ గా లాప్ టాప్ రీస్టార్ట్ అయ్యేలోపు మీరు టీజర్ ను చూసేయండి.
Full View
Tags:    

Similar News