బన్నీ - చెర్రీ మాట్లాడుకోవడం లేదా..?

Update: 2021-11-02 02:06 GMT
టాలీవుడ్ లో ఎన్ని సినీ కుటుంబాలు ఉన్నా.. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హవా కాస్త ఎక్కువ ఉంటుందనేది వాస్తవం. దీనికి అసలు కారణం మెగా హీరోలందరూ యూనిటీగా ఉండటమే అని.. ఒకరికొకరు సపోర్టుగా నిలబడుతుందటమే అని సినీ అభిమానులు భావిస్తుంటారు. లోపల ఎలా ఉన్నా.. బయటకు మాత్రం వీరంతా చాలా ఐకమత్యంగా ఉన్నట్లు కనిపిస్తుంటారని సినీ వర్గాలు అంటుంటాయి. మెగా హీరోలలో ఒకరంటే ఒకరికి పడటం లేదని గతంలో ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి.. కానీ అవి ఎప్పుడూ బయటపడలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని.. ఇద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన హీరోలైనప్పటికీ మెగా అభిమానుల వర్గంలో చీలికలు ఉన్నాయనేది సోషల్ మీడియాను ఫాలో అయ్యే ఎవరికైనా అర్థం అవుతుంది. చిరంజీవి - పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ విడిపోయి ట్విట్టర్ వార్ కు దిగడం చూశాం. 'మెగా వెర్సెస్ అల్లు' అనే విధంగా అభిమానులు ఫైట్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పుడు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత సొంత పేరుతో పైకొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని బన్నీ మీద మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఫ్యాన్ వార్స్ వల్ల మెగా హీరోల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ఎప్పుడూ వెల్లడికాలేదు. అయితే సినిమాల విడుదల తేదీల వ్యవహారం వల్ల చెర్రీ - బన్నీ మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్ ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పుడు విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. మరికొన్ని రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. మెగా హీరోలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి నుంచే ఎక్కువ సినిమాలు రాబోతున్నాయి. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆచార్య' 'పుష్ప' సినిమాల విడుదల తేదీల విషయంలోనే చాలా చర్చలు జరిగినట్లు టాక్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ.. జనవరి 7న 'ఆర్.ఆర్.ఆర్' ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో డేట్ చూసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో క్రిస్మస్ సీజన్ మేకర్స్ మదిలో మెలిగింది.

కాకపోతే క్రిస్మస్ సందర్భంగా 'పుష్ప' పార్ట్-1 ని విడుదల చేస్తున్నట్లు బన్నీ ముందుగానే ప్రకటించారు. డిసెంబర్ 17 రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చారు. అయితే ఆ తేదీ కోసం 'ఆచార్య' టీమ్ కూడా ట్రై చేశారని సమాచారం. దీనికి నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ చర్చలు ప్రారంభించగా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యే 'పుష్ప' వెనక్కి తగ్గడానికి విముఖత వ్యక్తం చేసిందట. దీంతో చేసేదేమీ లేక చిరు - చరణ్ లు కలిసి ఫిబ్రవరి మొదటి వారంలో రావాలని నిర్ణయం తీసుకున్నారని టాక్. ఈ వ్యవహారంలోనే రాంచరణ్ - అల్లు అర్జున్ ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగి పొరపొచ్చాలు వచ్చాయని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి - అల్లు అరవింద్ ఇద్దరూ బాగానే ఉన్నా.. రామ్ చరణ్ - అల్లు అర్జున్ మాత్రం మాట్లాడుకోవడం లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎవరికి వారు ఓన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత లేదని వినిపిస్తున్న మాటల్లో నిజమెంతో మరి.


Tags:    

Similar News