కలర్ ఫోటో.. హిట్టు సినిమానేనా?

Update: 2020-11-18 16:45 GMT
ఈ మధ్య కాలంలో వచ్చిన ఓటీటీ సినిమాల్లో బాగా చర్చనీయాంశమైన చిత్రం ‘కలర్ ఫోటో’. ఈ సినిమా గురించి అటు మేకర్స్.. ఇటు దాన్ని రిలీజ్ చేసిన ‘ఆహా’ ఓటీటీ వాళ్లు మామూలుగా ప్రమోట్ చేయలేదు. సినిమాలో మంచి పాటలున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. టెక్నికల్‌గా మంచి స్థాయిలోనే రూపొందిందీ సినిమా. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ బాగుంది. కొన్ని మంచి సన్నివేశాలున్నాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. చెప్పడానికి సినిమాలో చాలా లోపాలున్నాయి. కానీ ఇదో కళాఖండం అన్నట్లుగా చిత్ర బృందం గట్టి ప్రచారమే చేసుకుంది. అల్లు వారి ఓటీటీ కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టి, ప్రెస్టీజియస్‌గా రిలీజ్ చేసిన సినిమా కావడంతో టాలీవుడ్ లో పేరున్న సెలబ్రెటీలు చాలామంది పనిగట్టుకుని ఈ సినిమాను ప్రచారం చేశారు. వాళ్ల రివ్యూలు, కామెంట్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమానే రాలేదు అన్న అభిప్రాయం కలిగింది జనాలకు.

ఐతే ఈ ప్రమోషన్ వల్ల సినిమాకైతే మేలే జరిగినట్లుంది. ‘ఆహా’లో ఇప్పటిదాకా రిలీజైన కొత్త సినిమాలన్నింట్లోకి అత్యధిక వ్యూస్ తెచ్చుకున్నది ఈ సినిమానే అని సమాచారం. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ కొత్త సినిమా విడుదల సందర్భంగా కొత్త సబ్‌స్క్రిప్షన్లు బాగా పెరిగాయట. ఇక ఈ చిత్రానికి మొత్తంగా ఎన్ని వ్యూస్ వచ్చాయన్నది వెల్లడించలేదు కానీ.. మొత్తంగా 50 మిలియన్ మినిట్స్ ఈ సినిమా స్ట్రీమ్ అయినట్లుగా పేర్కొన్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 21 నిమిషాలు. ఒక్కొక్కరు పూర్తి నిడివిని ప్లే చేసిన ప్రకారం చూసుకుంటే ఈ చిత్రానికి మూడున్నర లక్షల వ్యూస్ వచ్చినట్లు లెక్క. అంటే ఆ మేరకు టికెట్లు తెగాయన్నమాట. ఐతే ఓటీటీ వ్యూస్ అన్నీ టికెట్లుగా మారతాయని చెప్పలేం కానీ.. అలా అనుకున్నా థియేటర్లలో రిలీజై ఉంటే.. సగటు టికెట్ ధర రూ.100 అనుకుంటే మూడున్నర కోట్లు వసూలై ఉంటాయన్నమాట. ఆ మేర వసూళ్లు వచ్చిన సినిమాను చిత్ర బృందం చెప్పుకున్నట్లు బ్లాక్‌బస్టర్ అని అయితే అనలేం. ఎబోవ్ యావరేజ్ లేదా హిట్ అని చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News