యాంక‌ర్ ర‌వి పోలీసుల అదుపులో లేడా?

Update: 2018-10-28 06:53 GMT
హుషారుగా మాట‌లు చెబుతూ.. అప్పుడ‌ప్పుడు జోకులు క‌ట్ చేసే ప్ర‌య‌త్నంలో కొంద‌రి చేత తిట్టు తింటాడ‌న్న పేరున్న టీవీ యాంక‌ర్ ర‌వికి సంబంధించిన వివాదం ఒక‌టి మీడియాలో రిపోర్ట్ అయ్యింది. అయితే.. దీనికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌కు.. వాస్త‌వానికి సంబంధం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా యాంక‌ర్ ర‌విపై ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఒక ఫిర్యాదు అందింది. దీంతో.. అత‌డ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌కీ యాంక‌ర్ ర‌వి మీద పోలీస్ స్టేష‌న్లో ఎలాంటి ఫిర్యాదు అందింద‌న్న విష‌యంలోకి వెళితే.. త‌నకున్న బాకీని వ‌సూలు చేసుకునేందుకు ర‌వి త‌న‌ను ఫోన్లో బెదిరించిన‌ట్లుగా ఒక సినీ డిస్ట్రిబ్యూట‌ర్ పేర్కొన్నారు.

అంతేకాదు.. 20 మందిని వెంట‌నేసుకొని త‌మ‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లుగా బాధితుడు చెబుతున్నారు. ఇనుప రాడ్లు ప‌ట్టుకొని త‌మ‌పై దాడికి వ‌చ్చాడ‌ని.. త‌న‌ను చంపేస్తాన‌ని బెదిరించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ ఫిర్యాదు మీద స్పందించిన ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసులు ర‌విని అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నించిన‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించి కొన్ని వార్త‌లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లకు చెందిన వెబ్ సైట్ల‌లో వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై యాంక‌ర్ ర‌వి ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు. తాజాగా ఒక వీడియో సందేశాన్ని ఆయ‌న పంపారు. అందులో ఏమున్న‌దంటే.. తాను అరెస్ట్ అయిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. తాను ప్ర‌స్తుతం మ‌చిలీప‌ట్నంలో ఉన్నాన‌ని.. జెమినీ టీవీ వారు నిర్వ‌హిస్తోన్న దివాలీ సెల‌బ్రేష‌న్ల‌కు సంబందించిన కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన్న‌ట్లు పేర్కొన్నారు. త‌న మీద వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అస‌త్యాలుగా కొట్టిపారేస్తున్నారు.

ఇంత‌కీ అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని గ్రౌండ్ లెవ‌ల్లో చెక్ చేస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అటు ర‌వి చెప్పిన దాన్లో కొంత నిజం ఉంది.. మీడియా చెప్పిన దాన్లోనూ నిజం ఉంది. ఎందుక‌లా అంటే.. యాంక‌ర్ ర‌వి మీద ఫిర్యాదు రావ‌టం.. ఆ వెంట‌నే పోలీసులు ర‌విని పోలీస్ స్టేష‌న్ కు పిలిపించటం వాస్త‌వం.

స్టేష‌న్ కు వ‌చ్చాక‌.. ఇరువురు త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటామ‌ని చెప్పారు.కాకుంటే.. ఫిర్యాదుదారు ఆరోపించిన‌ట్లుగా 20 మందిని తీసుకెళ్లి బెదిరించే ధోర‌ణి స‌రికాద‌ని.. అలానే చేస్తే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పోలీసులు ర‌విని హెచ్చ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదంతా జ‌రిగేస‌రికి అర్థ‌రాత్రి దాటింది. ఆ త‌ర్వాత త‌న ప్రోగ్రాంలో భాగంగా ర‌వి మ‌చిలీప‌ట్నం వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. యాంక‌ర్ ర‌వి చెప్పిన‌ట్లు ఆయ‌నిప్పుడు పోలీసుల అదుపులో లేడు. అలా అని.. ఆయ‌న పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది కూడా నిజ‌మే. కాకుంటే.. మీడియాలో వ‌చ్చిన వార్త అప్డేట్ కాక‌పోవ‌టం.. దాన్ని త‌ప్పు ప‌డుతూ యాంక‌ర్ ర‌వి వీడియో సందేశాన్ని పంప‌టంతో  క‌న్ఫ్యూజ‌న్ ఏర్ప‌డిదంతే. తాను మ‌చిలీప‌ట్నంలో ఉన్న‌ట్లు చెప్పిన ర‌వి.. జ‌రిగిన‌దంతా చెప్పేస్తే.. అస‌లే లొల్లి ఉండేది కాదు క‌దా?


Tags:    

Similar News