మూవీ రివ్యూ : కనెక్ట్

Update: 2022-12-22 11:35 GMT
‘కనెక్ట్’ మూవీ రివ్యూ
నటీనటులు: నయనతార-సత్యరాజ్-వినయ్ రాయ్-హనియా-అనుపమ్ ఖేర్ తదితరులు
సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: మణికంఠన్ కృష్ణమూర్తి
నిర్మాత: విఘ్నేష్ శివన్
రచన: అశ్విన్ శరవణన్-కావ్య రామ్ కుమార్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్

నయనతారతో తీసిన హార్రర్ థ్రిల్లర్ ‘మయూరి’తో దర్శకుడిగా అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు అశ్విన్ శరవణన్. ఆ తర్వాత తాప్సి ప్రధాన పాత్రలో అతను ‘గేమ్ ఛేంజర్’ అనే మరో వెరైటీ థ్రిల్లర్ తీశాడు. ఇప్పుడతను నయన్ ప్రధాన పాత్రలో ‘కనెక్ట్’ అనే వెరైటీ సినిమా తీశాడు. కరోనా-లాక్ డౌన్ తో ముడిపడ్డ ఈ హార్రర్ మూవీ ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సూసన్ (నయనతార).. డాక్టర్ అయిన తన భర్త జోెసెఫ్ (వినయ్ రాయ్).. కూతురు అమ్ము (హనియా)తో కలిసి సంతోషంగా జీవిస్తున్న మహిళ. ఐతే కరోనా మహమ్మారి మొదలయ్యాక ఎంతో మంది పేషెంట్లకు ప్రాణం పోసిన జోసెఫ్.. చివరికి తనే కరోనాకు బలవుతాడు. ఇంతలో సుసాన్.. అమ్ములకు కూడా వైరస్ సోకుతుంది. వాళ్లిద్దరూ ఇంట్లో ఐసొలేషన్లో చికిత్స తీసుకుంటుంటారు. ఐతే అమ్ము ఉన్నట్లుండి చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. అందుకు కేవలం కొవిడ్ మాత్రమే కారణం కాదని సుసాన్ కు అర్థమవుతుంది. రోజు రోజుకూ అమ్ము ప్రవర్తన విపరీత స్థాయికి చేరగా.. ఆమెకు దయ్యం పట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. కానీ లాక్ డౌన్ టైంలో కరోనాతో ఐసొలేట్ అయిన వాళ్లిద్దరికీ సాయం చేయడానికి ఎవరూ ఉండరు. ఈ స్థితిలో అమ్ము మామూలు మనిషైందా.. ఆమె వెంట ఉన్న సుసాన్ క్షేమమేనా.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

హార్రర్ సినిమా అనగానే.. దాదాపుగా కథలన్నీ ఒకే రకంగా ఉంటాయి. చాలా వరకు ఈ కథల్లో ఓ పడుచు యువతికి దయ్యం పట్టడం.. ఆ అమ్మాయి తన విచిత్ర ప్రవర్తనతో చుట్టూ ఉన్న వాళ్లను ఇబ్బంది పెట్టడం.. తర్వాత తనకు దయ్యం పట్టిందని తెలిసి.. విరుగుడు కోసం ప్రయత్నించడం.. భూత వైద్యం లాంటిదేదో చేసి తనకు ఆ దయ్యం వదలగొట్టడం.. చాలా హార్రర్ స్టోరీలు ఇదే లైన్లో నడుస్తుంటాయి. ఈ మధ్యే తెలుగులో వచ్చిన ‘మసూద’ కూడా ఇదే దారిలో నడుస్తుంది. కాకపోతే దయ్యాన్ని ముస్లింగా చూపించడం.. అలాగే ఆ దయ్యం కథను ఒళ్లు గగుర్పొడిచేలా నరేట్ చేయడం.. అలాగే కొన్ని చిల్లింగ్ మూమెంట్స్ ఆ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కథ ఒకటే అయినా దానికి ఎంచుకునే నేపథ్యంలో వైవిధ్యం ఉండి.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి-భయానికి గురి చేసే మూమెంట్స్ ఉండేలా చూసుకుంటే హార్రర్ సినిమాలు వర్కవుట్ అవుతాయి. ఇప్పుడు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన ‘కనెక్ట్’కు ఎంచుకున్న నేపథ్యం భిన్నమైందే. కరోనా-లాక్ డౌన్ అనే లేటెస్ట్ అండ్ ట్రెండీ బ్యాక్ డ్రాప్ లో హార్రర్ స్టోరీని నరేట్ చేయాలనుకోవడం మంచి ప్రయత్నమే. కానీ అంతకుమించి ‘కనెక్ట్’లో కొత్త అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవడం మైనస్. సాంకేతికంగా ఉన్నంతగా అనిపించినప్పటికీ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలేమీ లేకుండా.. మరీ నెమ్మదిగా సాగే ఈ చిత్రం హార్రర్ ప్రియులను కూడా చాలా వరకు నిరాశకే గురి చేస్తుంది. ఇక ఈ జానర్ ఇష్టపడని వాళ్ల సంగతి సరేసరి.

‘కనెక్ట్’ సినిమా పట్ల ప్రేక్షకులను ఆకర్షించే పేరు నయనతారదే. ఆమె కోసమే చాలామంది థియేటర్లకు వస్తారు. కానీ ‘కనెక్ట్’ అంతా అయ్యాక అసలు నయనతార ఎందుకు ఈ సినిమా ఒప్పుకుంది అనే సందేహం కలుగుతుంది. నయన్ మాత్రమే చేయాలి అనిపించేంత విషయం ఉన్న పాత్ర కాదు సూసన్. నయనతార ఏదో ఉందంటే ఉంది అనిపిస్తుంది సినిమాలో. అంత సాధారణంగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. సినిమాకు సంబంధించి ఇదే అతి పెద్ద నిరాశ. కథ మొత్తం ఆమె కూతురి పాత్రలో నటించిన హనియా చుట్టూనే తిరుగుతుంది. మామూలుగా హార్రర్ సినిమాలంటే కొంచెం గ్రామీణ స్టయిల్లో కొంచెం మాస్ గా నడుస్తాయి. కానీ ఇందులో మోడర్న్ గా.. క్లాస్ గా డీల్ చేసే ప్రయత్నం జరిగింది. వీడియో కాల్ ద్వారా ఒక మోడర్న్ మంత్రగత్తె హీరోయిన్ కూతురు ఒంట్లోకి దయ్యాన్ని పంపడం.. కరోనా సోకి తల్లీ కూతుళ్లు ఐసొలేట్ అయి ఎవరూ వారిని కలిసే వీల్లేని పరిస్థితుల్లో దయ్యం తన ప్రతాపాన్ని చూపించడం.. మొత్తంగా ఈ సెటప్ అంతా కొత్తగా.. ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. ఐతే ప్రేక్షకులను భయంతో వణికించేలా చేయడానికి సరిపోయే సెటప్ కుదిరినా.. ఆ తర్వాత దర్శకుడు అశ్విన్ శరవణన్ అంచనాలకు తగ్గట్లు కథనాన్ని నడిపించలేకపోయాడు.

ఎప్పుడూ హార్రర్ సినిమాల్లో చూసే జర్కులు తప్పితే.. ‘కనెక్ట్’లో సర్ప్రైజ్ అనిపించే హార్రర్ మూమెంట్స్ ఏమీ లేవు. పైగా హార్రర్ ఎలిమెంట్ ఒకసారి మొదలయ్యాక బ్రేకులు ఉండకూడదు. ఒక ఫ్లోలో సినిమా వెళ్లిపోవాలి. క్షణం క్షణం ఏమవుతుందన్న ఉత్కంఠ కలగాలి. కానీ ఇందులో అలా లేదు. కాస్త భయం కలిగేలా ఒక మూమెంట్ చూపించడం..  పాస్ ఇచ్చి తర్వాతి సీన్లో అంతా మామూలే అన్నట్లు సీన్ రావడం.. ఇదీ వరస. కథను ఒకట్రెండు రోజుల్లో జరిగినట్లు కాకుండా రోజుల తరబడి నడుస్తున్నట్లు చూపిస్తూ.. ఒక ఫ్లో లేకుండా సినిమాను ముందుకు నడిపించడంతో ఏ దశలోనూ ఫుల్ హార్రర్ ఫీల్ లోకి వెళ్లలేరు ప్రేక్షకులు. అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఎంగేజింగ్ గా అనిపించినా.. చాలా వరకు సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తించలేకపోయాయి. పతాక సన్నివేశాల్లో అయినా ఏమైనా వైవిధ్యం ఉంటుందేమో అని చూస్తే.. భూత వైద్యాన్ని కొంచెం ఆధునికంగా.. క్రిస్టియన్ స్టయిల్లో చూపించడం తప్ప అశ్విన్ శరవణన్ కొత్తగా చేసిందేమీ లేదు. గంటా 39 నిమిషాల తక్కువ నిడివిలో తీసిన హార్రర్ సినిమా మరీ నెమ్మదిగా నడిచిన భావన కలిగిందంటే.. అది ఎంతమాత్రం ఎంగేజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కరోనా-లాక్ డౌన్ నేపథ్యం.. కొన్ని మూమెంట్స్.. సాంకేతిక ఆకర్షణలు మినహాయిస్తే ‘కనెక్ట్’లో పెద్ద విశేషాలు లేవు.

నటీనటులు:

‘కనెక్ట్’లో నయనతార పెర్ఫామెన్స్ పరంగా వంకలు పెట్టడానికేమీ లేదు. భర్తను కోల్పోయిన బాధను అనుభవిస్తూ.. దయ్యం బారిన పడ్డ కూతురిని కాపాడుకోవాలని తపించే నడి వయసు మహిళ పాత్రలో ఆమె సులువుగా ఒదిగిపోయింది. పతాక సన్నివేశాల్లో ఆమె నటన మరింత మెప్పిస్తుంది. కానీ పాత్ర పరంగా మాత్రం నయన్ నుంచి ఎంతో ఆశించే అభిమానులకు నిరాశ తప్పదు. నయన్ కాకుండా ఆ పాత్రలో ఎవరున్నా పెద్దగా తేడా ఉండేది కాదు. కూతురి పాత్రలో హనియా బాగానే చేసింది. కానీ ఎక్కువగా ఆమెను మబ్బులో పెట్టి సీన్లు తీయడం.. ముఖాన్ని జుట్టుతో కప్పేయడం వల్ల హావభావాల గురించి చెప్పడానికేమీ లేకపోయింది. ఆ అమ్మాయి గురించి కంగారు పడుతూ.. తనను కాపాడుకోవడానికి తపన పడే తాతయ్య పాత్రలో సత్యరాజ్ సహజంగా నటించాడు. వినయ్ రాయ్ కనిపించేది కాసేపే. అనుపమ్ ఖేర్ సేవియర్ పాత్రలో రాణించాడు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా ‘కనెక్ట్’ అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో పృథ్వీ చంద్రశేఖర్ అదరగొట్టాడు. సౌండ్ డిజైన్ చాలా బాగుంది.  మణికంఠన్ కృష్ణమూర్తి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకుడు అశ్విన్ శరవణన్.. నయనతారతోనే తీసిన తన తొలి చిత్రం ‘మయూరి’ చిత్రం తర్వాత తనపై నెలకొన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. రెండో సినిమా ‘గేమ్ ఓవర్’తోనే అతడి గ్రాఫ్ కొంచెం తగ్గింది. ఈసారి ఇంకా కింది స్థాయి సినిమాను అందించాడనే చెెప్పాలి. హార్రర్ జానర్ మీద తనకున్న పట్టును తెలిపే సన్నివేశాలు ఇందులోనూ ఉన్నాయి కానీ.. ఓవరాల్ గా అశ్విన్ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. విభిన్న నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ.. కథాకథనాల్లో పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు.

చివరగా: కనెక్ట్.. కనెక్ట్ కావడం కష్టమే

రేటింగ్-2.25/5
Tags:    

Similar News