థియేట‌ర్ల‌ పైనా క‌రోనా బాంబ్

Update: 2020-03-04 18:30 GMT
నిశ్చ‌లంగా ఉన్న త‌టాకంలోకి రాయి విసిరితే దాని అల‌జడి అంతా ఇంతా కాదు. త‌టాకం అంతా క‌ల్లోల‌మే అవుతుంది. ప్ర‌స్తుతం క‌రోనా తెచ్చిన ముప్పు అలానే ఉంది. ఇది అన్ని ఇండ‌స్ట్రీల్ని క‌బ‌ళించేస్తోంది. ఇప్ప‌టికే స్టాక్ మార్కెట్ల‌ను కుదిపేస్తున్న క‌రోనా.. ర‌క‌ర‌కాల ఎగుమ‌తి దిగుమ‌తి వ్యాపారాల్ని స‌ర్వ‌నాశ‌నం చేసింది. ఇక చైనాతో ముడిప‌డిన వినోద పరిశ్ర‌మ‌పైనా పెద్ద పంచ్ ప‌డిపోయింది.

ఇది అసాధార‌ణ ప‌రిస్థితి. ఊహాతీత‌మైన‌ది. ఎక్క‌డో చైనాలో పుట్టిన క‌రోనా ప్ర‌పంచ దేశాల్నే ఒణికించేస్తోంది. ఇక వినోద ప‌రిశ్ర‌మ అంటే బాలీవుడ్ స‌హా టాలీవుడ్ కోలీవుడ్ పైనా దీని ప్ర‌భావం అసాధార‌ణంగా ఉండ‌నుందని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఏపీలోనూ క‌రోనా క‌ల్లోలం మొద‌లైపోయింది. అక్క‌డొక‌రు ఇక్క‌డొక‌రు అంటూ వార్త‌లు రావ‌డంతో ఇక జ‌నాల్లో గుబులు మొద‌లైంది. పైగా క‌రోనా దెబ్బ‌కు ఝ‌డిసిన ప్ర‌భుత్వం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తోంది. గుంపులుగా జ‌నం ఉండే చోటికి వెళ్లొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో ప్ర‌యాణాలు చేసేందుకైనా లేదా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూసేందుకైనా హోట‌ల్ కి తినేందుకు వెళ్లాల‌న్నా జనం జంకే ప‌రిస్థితి. ఈ సీన్ ఇలానే ఉంటే మునుముందు మ‌ల్టీప్లెక్సు థియేట‌ర్లు.. సింగిల్ థియేట‌ర్లు .. సింగిల్ ప్లెక్స్ వంటి వాటి ప‌రిస్థితేమిటో అంచ‌నా వేయొచ్చు. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్సుల్లో ఇక‌పై గుంపులు గుంపులుగా జ‌నాల్ని చూడ‌లేని ప‌రిస్థితి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.

మొత్తానికి క‌రోనా భ‌యం ఇటు తెలుగు సినిమా నిర్మాత‌లు.. పంపిణీదారులు.. ఎగ్జిబిట‌ర్ల‌ను కుదిపేస్తోంద‌ని తెలుస్తోంది. మునుముందు రిలీజ్ కానున్న సినిమాల‌పై క‌రోనా ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించ‌నుంది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా బిగ్ పంచ్ ప‌డిపోనుంద‌ని అటు బ‌య్య‌ర్లు... ఎగ్జిబిట‌ర్ల‌లో భ‌యం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికి స్థ‌బ్ధుగా ఉన్నా మ‌రో వారం రోజుల్లో దీని ఉధృతి ఎలా ఉందో తేలిపోనుంది. ఇప్ప‌టికి అంతా గ‌జ‌గ‌జ ఒణుకుతున్నారు. కోట్లాది రూపాయ‌ల బిజినెస్ కి సంబంధించిన వ్య‌వ‌హారం కాబ‌ట్టి ఈ భ‌యం మ‌రింత‌గా పెరుగుతోంది.


Tags:    

Similar News