కమల్.. విశాల్.. నాజర్ లు తప్పు చేశారా?

Update: 2016-09-15 04:49 GMT
ప్రముఖ నటులు కమల్ హాసన్.. విశాల్.. నాజర్ లు చిక్కుల్లో పడ్డారా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా వారికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నడిగర్ సంఘానికి సంబందించిన భవన నిర్మాణంలో ఈ ముగ్గురుతో పాటు మరో ఆరుగురు తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలతో ఒక ఫిర్యాదు కోర్టు ముందుకు వచ్చింది.  దీంతో.. ఈ వ్యవహారంలో నడిగర్ సంఘానికి చెందిన తొమ్మిది మందికి కోర్టునోటీసులు జారీ చేసింది.

అసలీ వివాదం ఎలా షురూ అయ్యిందన్న విషయాన్ని చూస్తే.. నడిగర్ సంఘం తరఫున ఒక భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ఈ సంఘం 62వ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే.. నిర్ణయం ఏకపక్షమంటూ తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్ సంఘ సభ్యుడు ఒకరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎవరితోనూ చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారు. సంఘ సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయటంతో పాటు.. సభ్యులందరితో చర్చించిన తర్వాత కొత్త ఒప్పందం చేసుకోవాలంటూ హైకోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు.. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటులు కమల్ హాసన్.. విశాల్.. నాజర్ తో పాటు మరో ఆరుగురికి నోటీసులు జారీ చేశారు. నడిగర్ సంఘం అధ్యక్షులుగా నాజర్.. కార్యదర్శిగా విశాల్.. కోశాధికారిగా కార్తీ.. సంఘ ట్రస్ట్ సభ్యులుగా కమల్ హాసన్ తదితరులు వ్యవహరిస్తున్నారు. గతంతో నడిగర్ సంఘ్ ఎన్నికలు జరిగినప్పుడు హీరో విశాల్ వర్గానికి.. మరో హీరో శరత్ కుమార్ వర్గానికి పోటాపోటీగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు కోలీవుడ్ లో సరికొత్త చర్చకు తావిచ్చినట్లైంది.
Tags:    

Similar News