టిక్కెట్టుపై త‌గ్గేదే లే! క్రేజీ రిలీజ్ లు గోల్ మాల్!!

Update: 2021-07-26 05:30 GMT
తెలంగాణ‌లో 100శాతం ఆక్యుపెన్సీ.. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాల్ని ఆడించేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌ర‌ణ అనేది పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రీ దారుణంగా టిక్కెట్టు ధ‌ర‌ల్ని త‌గ్గించింద‌ని దీనివ‌ల్ల ఎగ్జిబిట‌ర్లకు నిర్మాత‌ల‌కు తీవ్ర న‌ష్టాలు త‌ప్ప‌ద‌ని ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల్ని పెంచ‌క‌పోతే తెలంగాణ లోనూ రిలీజ్ చేయ‌లేమ‌ని ఇంత‌కుముందు తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వానికి ఆ మేర‌కు లేఖ‌ను రాసింది. కానీ టిక్కెట్టుపై త‌గ్తేదే లే! అంటూ జ‌గ‌న్ స‌ర్కార్ మొండి ప‌ట్టు ప‌ట్టుకుని కూచుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్ సమస్యలకు ఇంకా పరిష్కారం ద‌ర‌క‌లేదు. టికెట్ ధరల స‌వ‌ర‌ణ‌ గురించి కొత్తగా ప్రవేశపెట్టిన జీవోపైనా చ‌ర్చ సాగుతూనే ఉంది. ఎవ‌రు ఎలా ప్ర‌య‌త్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగి రావ‌డం లేదు. టిక్కెట్టు పెంపుపై భ‌రోసా దొర‌కడం లేదు. మ‌రోవైపు పాత రేట్లు వ‌స్తేనే థియేట‌ర్ల‌ను తెరుస్తామ‌ని చాలా చోట్ల బంద్ ని కొన‌సాగిస్తున్నారు. గోదారి జిల్లాలు స‌హా చాలా చోట్ల థియేట‌ర్లు తెరిచేందుకు ఎవ‌రూ సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. పాత రేట్లు కొన‌సాగించాలి. మునుప‌టిలా 70-100 మ‌ధ్య టికెట్ ధ‌ర‌ని నిర్ణ‌యిస్తేనే సింగిల్ థియేట‌ర్లు ఏసీతో మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌వ‌ని నివేదిస్తున్నారు. నిజానికి వ‌కీల్ సాబ్ ముందు రూ.150 టిక్కెట్టు ధ‌ర ఉండేది. మ‌ల్టీప్లెక్సుల్లో ఇంకా ఎక్కువ‌. కానీ ఇప్పుడు ఆ ధ‌ర‌లేవీ లేవు. దీంతో ఎగ్జిబిష‌న్ రంగం మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మైంద‌ని నివేదిస్తున్నారు.

తెలంగాణ అంతటా థియేటర్లు జూలై 30 నుండి తెరిచి చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో  పార్కింగ్ ఫీజు వ‌సూళ్ల‌కు సింగిల్ స్క్రీన్లకు అనుమ‌తినివ్వ‌గా.. ఇంకా ఎగ్జిబిషన్ పరిశ్రమకు మాఫీల రూపంలో మద్దతు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుత స‌న్నివేశంలో కొన్ని సినిమాలు థియేట్రిక‌ల్ రిలీజ్ ని ఎంచుకున్నా.. చాలా క్రేజీ చిత్రాలు మాత్రం వేచి చూసే ధోర‌ణిలోనే ఉన్నాయి.  తిమ్మరుసు- ఇష్క్- ఎస్.ఆర్ కల్యాణ మండపం త్వరలో విడుదల కానున్నాయి. కానీ నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరి.. నాని టక్ జగదీష్.. గోపిచంద్ సీటీమార్ ల‌ను రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌ను విర‌మించార‌ని తెలుస్తోంది. ఏపీ తెలంగాణ రెండు చోట్లా ఒకే టిక్కెట్టు ధ‌ర ఉంటేనే వీటిని రిలీజ్ చేయ‌గ‌ల‌మ‌ని భావిస్తున్నార‌ట‌. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఎగ్జిబిటర్లు పంపిణీదారులు ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించాలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే మ‌రోవైపు మ‌హారాష్ట్ర - దిల్లీ స‌హా ప‌లుచోట్ల క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భంజ‌నం మొద‌లైంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళ‌న‌తోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ సినిమాల‌ను రిలీజ్ చేయాలా వ‌ద్దా? అన్న సందిగ్థ‌త‌లో అంతా ఉన్నారు. రానున్న రోజుల్లో డ‌జ‌ను పైగా క్రేజీ చిత్రాలు రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా ర‌క‌ర‌కాల ప‌రిణామాలు తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి.
Tags:    

Similar News