క్యూనెట్ ఫ్రాడ్‌!... ఈ సెల‌బ్రిటీల‌కు చుక్క‌లేనా!

Update: 2019-02-27 09:23 GMT
మ‌ల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క - మ‌హారాష్ట్రల్లో వేలాది మంది అమాయకుల నుంచి వెయ్యి కోట్ల రూపాయ‌ల మేర మోసానికి పాల్ప‌డ్డ క్యూ నెట్ కేసు ఇప్పుడు సెల‌బ్రిటీల మెడ‌కు చుట్టేసుకుంది. ఇద్ద‌రు మోస‌గాళ్ల చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ నిర్వాకం కార‌ణంగా బాలీవుడ్‌ కు చెందిన ప్ర‌ముఖ న‌టుల‌తో పాటు టాలీవుడ్ న‌టులు - క్రికెట‌ర్లు కూడా ఇప్పుడు పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన దుస్థితి నెల‌కొంది. ఈ కేసు విచార‌ణ చేప‌ట్టిన‌ తెలంగాణకు చెందిన సైబ‌రాబాద్ పోలీసులు ఈ మేర‌కు ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల‌కు నోటీసులు జారీ చేశారు. ఈ వ్య‌వహారం ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్‌ - క్రికెట్ వర్గాల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది.

క్యూ నెట్ పేరిట ఓ సంస్థ‌ను నెల‌కొల్పిన జోసఫ్ బిస్మార్క్ - విజయ్ ఈశ్వరన్.. నిరుద్యోగులే టార్గెట్ గా వ్యాపార కార్యకలాపాలు విస్తరించారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఇక నెలనెలా మీకు ఆదాయమే అంటూ ఊరించారు. షార్ట్ పీరియడ్ లో మీరు కోటీశ్వరులు కావొచ్చంటూ మాయమాటలు చెప్పారు. అయితే దానికి కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుందంటూ నమ్మించారు. ఇక లక్షలకొద్దీ రూపాయలు కట్టించుకుంటూ పిట్ట కథలు వల్లించారు. ఏదో చెబుతూ, మరేదో చేస్తూ రెండు మూడు నెలలు వారిని వీరిచుట్టూ తిప్పించుకుని ఆ తర్వాత అసలు కథ మొదలెట్టారు. గొలుసుకట్టు మాయాజాలం నూరిపోశారు. బంధువులు - స్నేహితులను చేర్పిస్తూ సంస్థ ఉత్పత్తులు అమ్మితేనే మీకు కోట్లు వస్తాయంటూ మరో కహానీ వినిపించారు.

ఈ విధంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక - మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లక్షలాది మందిని మోసగించారు. వీరి మోసం విలువ వెయ్యి కోట్ల రూపాయ‌లు క్రాస్ చేసింద‌ని తెలుస్తోంది. బాధితుల నుంచి వ‌రుస‌గా ఫిర్యాదులు రావ‌డంతో దీనిపై కేసులు న‌మోదు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు... ఈ కుచ్చుటోపీ వ్య‌వ‌హారాన్ని పూర్తిగా విప్ప‌డం మొద‌లెట్టారు. ఈ క్ర‌మంలో క్యూ నెట్ వ్యాపార విస్త‌ర‌ణ‌కు ప‌లువురు సెలబ్రిటీలు ఉప‌యోగ‌ప‌డిన వైనం వెలుగు చూసింది. అయితే ఈ సెల‌బ్రిటీల ప్ర‌మేయం ప్రత్య‌క్షంగా కాకుండా ప‌రోక్షంగానే తేలింద‌ట‌. అదెలాగంటే... ఈ సంస్థ వ్యాపార విస్త‌ర‌ణ క్ర‌మంలో రూపొందించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌ - కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ బోమ‌న్ ఇరానీ - టాలీవుడ్ కుర్ర హీరో అల్లు శిరీష్‌ - టాప్ హీరోయిన్ పూజా హెగ్డేల‌తో పాటు ప్ర‌ముఖ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ కూడా క‌నిపించారు.

ఆ సంస్థ ప్ర‌తిపాద‌న‌ల మేరకే వీరంతా యాడ్స్‌లో న‌టించారు. వీరంతా ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల‌నే క్యూ నెట్ అతి త‌క్కువ కాలంలోనే వెయ్యి కోట్ల రూపాయ‌ల మేర మోసం చేయ‌గ‌లిగింద‌న్న‌ది పోలీసుల వాద‌న‌. ఎవ‌రు డ‌బ్బులిస్తామంటే... వారి పుట్టుపూర్వోత్త‌రాలు తెలుసుకోకుండా యాడ్స్‌ కు ఎలా అంగీక‌రించార‌ని ఈ సెల‌బ్రిటీల‌పై పోలీసులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కంపెనీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెలికితీసే స్ర‌మంలోనే వీరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిర్దేశిత స‌మ‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని, లేని ప‌క్షంలో చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని కూడా స‌ద‌రు నోటీసుల్లో సెల‌బ్రిటీల‌కు పోలీసులు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News