బ్రూస్ లీ దెబ్బ నుంచి బయటపడ్డాడు

Update: 2016-02-11 22:30 GMT
బ్రూస్ లీ.. గత ఏడాది పెద్ద డిజాస్టర్లలో ఒకటి. వసూళ్లలో రికార్డుల మోత మోగించేస్తుందనుకున్న ఈ సినిమా బయ్యర్లకు నష్టాలు మిగల్చడంలో రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాకు దాదాపు రూ.20 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు అంచనా. ‘బ్రూస్ లీ’ సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్‌ తో తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. కానీ ఆ సినిమా ఫలితం తేడా కొట్టేయడంతో పరిస్థితి మారిపోయింది. బయ్యర్లకు నష్టాలు సెటిల్ చేయాల్సిన స్థితిలో బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ‘తనీ ఒరువన్’ రీమేక్ రైట్స్ తీసుకున్నది ఆయనే కానీ.. ఈ సినిమాను అల్లు అరవింద్‌ కు అప్పగించాల్సి వచ్చింది.

మొత్తానికి ‘బ్రూస్ లీ’ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దానయ్య.. ఎట్టకేలకు తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కాల్సిన ‘రాబిన్ హుడ్’ అనుకోకుండా దానయ్య చేతికి వచ్చింది. నిజానికి ఈ చిత్రాన్ని రంజిత్ మూవీస్ దామోదర ప్రసాద్ నిర్మించాల్సింది. కానీ ఎందుకో ఆయన తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్టు దానయ్య చేతికి వచ్చింది. దానయ్య ఇంతకుముందు రవితేజతో ‘దుబాయ్ శీను’ లాంటి హిట్టు సినిమా తీశాడు. ఆ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పుడు దానయ్యకు అంత మంచి బ్రేక్ ఇచ్చిన శ్రీను వైట్లే.. ‘బ్రూస్ లీ’తో హార్ట్ బ్రేక్ అయ్యేలా చేశాడు.
Tags:    

Similar News