దాస‌రి బ‌యోపిక్ టైటిల్ రెడీ.. ద‌ర్శ‌కుడెవ‌రు?

Update: 2021-07-13 08:35 GMT
దర్శకర‌త్న డా.దాసరి నారాయ‌ణ‌రావు బ‌యోపిక్ ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏదీ..?  ద‌ర్శ‌కుడెవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

తాజా స‌మాచారం మేర‌కు.. దాస‌రి స్మారకార్ధం ప్ర‌తియేటా దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ అండ్ టీవీ అవార్డ్స్ ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే `దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్` ఏర్పాటు చేశామ‌ని దాస‌రి బ‌యోపిక్ నిర్మాత  ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు వెల్ల‌డించారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు ఈ వేదిక‌పై ఇవ్వనున్నారు.

దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు... ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో `దాసరి బయోపిక్` నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ పేరు `దర్శకరత్న`. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఈ బయోపిక్ లో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారు.  దాసరికి అత్యంత సన్నిహితులు ప్రముఖ దర్శకులు అయిన ధవళ సత్యం ఇప్పటికే బ‌యోపిక్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చింది. పూర్తి వివరాలు అతి త్వరలో వెల్ల‌డించ‌నున్నారు.

నిజానికి దాస‌రి బ‌యోపిక్ ప్ర‌క‌టించిన అనంత‌రం క్రిటిక్స్ ర‌క‌ర‌కాల సందేహాల్ని లేవనెత్తారు. దాస‌రి జీవితక‌థ‌లో ఎన్నో ఎమోష‌న్స్ ఉన్నాయి. ఒడిదుడుకులు క‌ష్టాలు క‌న్నీళ్లు ఉన్నాయి. వివాదాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెర‌పైకి య‌థాత‌థంగా తెస్తారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

కీ.శే. దాస‌రి నారాయణ‌రావు జీవితంలో అతి పెద్ద వివాదంపైనా మ‌రోసారి చ‌ర్చ సాగింది. 90ల‌లోనే ప‌రిశ్ర‌మలో స‌క్సెస్ తో ఉన్న ఒక‌ అగ్ర హీరోతో దాస‌రికి విభేధాలు పొడ‌సూప‌డం అప్ప‌ట్లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ ఉదంతాన్ని ఈ బ‌యోపిక్ లో చూపిస్తారా? అలాగే దాస‌రి కుటుంబంలో క‌ల‌హాల గురించి ఈ బ‌యోపిక్ లో చూపించ‌గ‌ల‌రా..?  దాస‌రి ఇంట‌ ఆస్తి కుమ్ములాట‌లను ప్ర‌స్థావించ‌గ‌ల‌రా? అంటూ అంతటా డిస్క‌ష‌న్ స్టార్ట‌య్యింది. ఇక దాస‌రి బొగ్గు శాఖా మంత్రిగా ఉన్న‌ప్పుడు కుంభ‌కోణం అంటూ బోలెడంత ర‌చ్చ సాగింది. ఆ విష‌యాన్ని ఈ బ‌యోపిక్ లో చూపిస్తారా?   లేదా ఎన్టీఆర్ బ‌యోపిక్ లా వాస్త‌వాల్ని దాచి నిరాశ‌కు గురి చేస్తారా? అన్న చ‌ర్చా ఇటీవ‌ల సాగింది.

దాస‌రి స్వ‌గ‌తం ప‌రిశీలిస్తే...

ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రు ఉన్నా దాస‌రి వేరు. ఆయ‌న మ‌హావృక్షం. ఎంద‌రికో నీడ‌నిచ్చిన క‌ల్ప‌త‌రువు. ఉపాధినిచ్చి అన్నం పెట్టిన మ‌హాత్ముడు ఆయ‌న‌. ఒక ర‌కంగా ఆయ‌న బ‌తికి ఉన్న‌న్నాళ్లు జూబ్లీహిల్స్ లోని ఆయ‌న ఇల్లు ఒక నిత్య‌ అన్న‌దాన స‌త్రం .. అంతగా ఆయ‌న ప‌రిశ్ర‌మ‌లో శిష్యుల్ని చేర‌దీశారు. నా అన్న‌వాళ్ల‌ను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి క‌ల్పించారు. వంద‌లాది మంది ఆర్టిస్టుల్ని టెక్నీషియ‌న్ల‌ను ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన గొప్ప వ్య‌క్తి. దిగ్ధ‌ర్శ‌కుడు. దార్శ‌నికుడు. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో రెండు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ నిపుణుడు. లంచ్ బ్రేక్ లో స్క్రిప్టు రాయ‌గ‌ల స‌మ‌ర్థుడు.

ద‌ర్శ‌కుడిగా 150 సినిమాల అసాధార‌ణ జ‌ర్నీ.. త‌న సినిమాల‌కు తానే ర‌చ‌యిత‌. ఆ 150 సినిమాల‌తో ఎంద‌రికో ఉపాధినిచ్చారు. శిష్యుల‌ను పెద్ద ద‌ర్శ‌కుల‌ను చేసేందుకు నిర్మాత‌గా మారిన గొప్ప వ్య‌క్తిత్వం. కేవ‌లం ఆయ‌న అంద‌రికీ ఉపాధినిచ్చి వ‌దిలేయ‌లేదు.. వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా త‌న‌కు చెప్పుకునేంత గొప్ప స‌హృద‌య‌త‌ ఆయ‌నకు మాత్ర‌మే సాధ్య‌మైంది. ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఉక్కుపాదం మోపేంత గొప్ప దార్శ‌నికుడు ఆయ‌న‌. ప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల కార్మికుల్ని ఏక‌తాటిపై న‌డిపించిన గ్రేట్ ప‌ర్స‌నాలిటీ. కార్మికుల‌కు నేటి చిత్ర‌పురి కాల‌నీ అందుబాటులో ఉంది అంటే దానివెన‌క దాస‌రి కృషిని ఎవ‌రూ మ‌రువ‌నిది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోని మ‌హామ‌హులు హైదరాబాద్ కి వ‌స్తే ఆయ‌న‌కు సాష్ఠాంగ న‌మ‌స్కారం చేసి మ‌రీ వెళ్లేవారంటే ఆయ‌న ఖ్యాతి ఇరుగు పొరుగునా ఎంత‌గా విస్త‌రించిందో అర్థం చేసుకోవ‌చ్చు. బాల‌చంద‌ర్- భార‌తీరాజా -క‌మ‌ల్ హాస‌న్ అంత‌టి వారు ఆయ‌న‌కు వీరాభిమానులు. దాస‌రి అంటే సూప‌ర్ ప‌వర్. ఆయ‌న ప‌రిస‌రాల్లో గాంభీర్యం ఎవ‌రినీ మాట్లాడ‌నివ్వ‌దు.. సైలెన్స్ ఉంటుంది. అలాగ‌ని ఆయ‌నేమీ సీరియ‌స్ త‌ర‌హా కాదు. ఎంతో ఫ‌న్నీగా త‌న వారితో మాట్లాడ‌తారు. ఇలాంటి విల‌క్ష‌ణ‌త చాలా అరుదు. అందుకే ఆయ‌న కాలంతో పాటు వెళ్లినా ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌రూ మ‌రువ‌రు. అన్న‌ట్టు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు అంత‌ర్థానం అయ్యాక ఆ లోటు అలానే ఉంద‌నేది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చెప్పుకునే మాట‌. 4 మే 1947లో పాల‌కొల్లు(ఆంధ్ర‌ప్ర‌దేశ్)లో జ‌న్మించిన ఆయ‌న మ‌ద్రాసుకు వెళ్లి ద‌ర్శ‌కుడిగా సుదీర్ఘ‌ ప్ర‌స్థానం సాగించారు. మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ కి సినీప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించ‌డంలో కీల‌క వ్య‌క్తి. 1947లో దాసరి నారాయణరావు జన్మించారు. 1972లో `తాత మనవడు` చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
Tags:    

Similar News