స్టార్లు ఫామ్ హౌస్ ల పట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ఎలా?

Update: 2019-09-19 06:12 GMT
హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప‌రిస‌ర గ్రామాల్లో స్టార్ హీరోలు స‌హా ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు అతిధిగృహాలు.. వ్య‌వ‌సాయ క్షేత్రాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని ఎక‌రాల విస్తీర్ణంలో వ్య‌వ‌సాయ క్షేత్రాల్ని ప‌లువురు ప్ర‌ముఖులు నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ అధునాత ప‌ద్థ‌తుల్లో సేంద్రియ పంట‌ల్ని పండిస్తున్నారు. అక్క‌డ పండిన కూర‌గాయ‌ల్ని బ‌హిరంగ మార్కెట్ల‌కు త‌ర‌లించి ఆదాయ ఆర్జ‌న చేయ‌డంపై ఇదివ‌ర‌కూ మీడియాలో ప‌లు ఆస‌క్తిక‌ర‌ క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే కొంద‌రు పంట‌లు పండిస్తే మ‌రికొంద‌రు ఏళ్ల త‌ర‌బ‌డి ఆ ఫామ్ హౌస్ లో ఎలాంటి కార్య‌క‌లాపాలు లేకుండా వ‌దిలేయాల్సిన స‌న్నివేశం ఉంది. హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లో నీటి ఎద్ద‌డి వ‌ల్ల పంట‌లు పండించ‌డానికి అనువుగాని చోట ప‌రిమిత నీటి వ‌న‌రుతో స్ప్రింక్ల‌ర్ త‌ర‌హా వ్య‌వ‌సాయం చేస్తున్నారు. కొంద‌రు ఆ స‌దుపాయం చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఫామ్ హౌస్ ల‌ను ఖాళీగానే వ‌దిలేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.

అయితే ఇలా వ‌దిలేసిన క్షేత్రాల్లో అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు నెల‌వుగా మారుతున్నాయి. తాగి తంద‌నాలాడేవారు.. లేదా వ్య‌భిచార అత్యాచారాల‌కు ఇవి కేంద్రాలుగా మారిన వైనం ఇంత‌కుముందు ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిర్గ‌త‌మైంది. అలాగే ఇలాంటి చోట మృత‌దేహాలు ల‌భ్య‌మ‌వ్వడం సంచ‌లన‌మైన సంద‌ర్భాలున్నాయి. ఇంత‌కుముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఇలానే జ‌రిగింది. దాంతో ఈ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ ని త‌ప్పు ప‌డుతూ మీడియాలో క‌థనాలొచ్చాయి.

తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన షాద్ న‌గ‌ర్ పాపి రెడ్డి గూడ‌ ఫామ్ హౌస్ కం వ్య‌వ‌సాయ క్షేత్రంలో మృత‌దేహం ల‌భ్యమైంద‌న్న వార్త‌లు సంచ‌లనంగా మారాయి. ఏడాది పాటు కుళ్లి ప‌డి ఉన్నమృత‌దేహాన్ని ఇక్క‌డ‌ పోలీసులు గుర్తించార‌ని చెబుతున్నారు. స్థానికులు అందించిన స‌మాచారం మేర‌కు పోలీస్ ద‌ర్యాప్తు సాగుతోంది. ఔట్ స్క‌ర్ట్స్ లో దాదాపు 40 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్ హౌస్ లో ఒక మూల‌న ఉన్న గ‌దిలో ఈ ఘ‌ట‌నకు సంబంధించిన ఆధారం ల‌భించింది. ఏడాది పాటు దీనిని క‌నుగొన‌లేని ప‌రిస్థితి ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ మృత‌దేహానికి పోలీసుల స‌మ‌క్షంలో అక్క‌డే పోస్ట్ మార్ట‌మ్ ని నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నెల 10న వ్యవసాయ కేత్రంలో ఓ మొక్క‌ను నాటిన నాగార్జున భార్య అమల...వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పాట్లు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే అంత పెద్ద స్టార్లు ఫామ్ హౌస్ లు ఇలా కేర్ లెస్ గా వ‌దిలేస్తారా... ఇలాంటి అవాంచ‌నీయ‌మైన‌వి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త తీసుకోరా? అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరా వ్య‌వ‌స్థ‌తో సెక్యూరిటీ లేనిదే ఫామ్ హౌస్ ల నిర్వ‌హ‌ణ‌ను అనుమ‌తించే వీల్లేద‌న్న సూచ‌న‌లు ఉన్నా వాటిని ఎవ‌రూ పట్టించుకోని స‌న్నివేశం ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌ కేవ‌లం ఓ ఇద్ద‌రు స్టార్ హీరోల‌కే కాదు...  టాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ హీరోలంద‌రికీ ఫామ్ హౌస్ లు ఉన్నాయ‌ని స‌మాచారం ఉంది. ప‌లువురు సినీ రాజ‌కీయ నాయ‌కులు వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో సేంద్రియ పంట‌లు పండిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణకు సిటీ శివారులో ఎక‌రాల్లో పంట సాగు చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. అధునాత ప‌ద్ధ‌తుల్లో స్ప్రింక్ల‌ర్ త‌ర‌హా వ్య‌వ‌సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సేంద్రియ ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌ల్ని పండిస్తున్నార‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News