గెహ్రాయాన్ ఫస్ట్ లుక్: కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదోయ్!

Update: 2021-12-21 03:30 GMT
దీపికా పదుకొనే ప్ర‌స్తుతం టాలీవుడ్ ఎంట్రీ వేళ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్రాజెక్ట్ -కేలో న‌టిస్తోంది. ఈ సినిమా త‌న కెరీర్ లో చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని ఇంత‌కుముందు కితాబిచ్చేసింది. నాగ్ అశ్విన్ ఒక కొత్త జోన‌ర్ సినిమా తీస్తున్నార‌ని తెలిపింది. ఇలాంటి అవ‌కాశం ఇదే తొలిసారి.. త‌న పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని దీపిక తెలిపింది.

అంత‌కుముందు దీపిక న‌టించిన గెహ్రైయాన్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీపిక‌- అనన్య పాండే- సిద్ధాంత్ చతుర్వేది- ధైర్య కర్వా నటించిన గెహ్రైయాన్ జనవరి 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. శకున్ బాత్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ విడుద‌లైంది. టీజ‌ర్‌ క్లిప్ ను పంచుకుంటూ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ వ్యాఖ్య‌ను జోడించారు. “ఇది లోతుగా డైవ్ చేసి ఉపరితలం క్రింద ఏముందో తెలుసుకోవడానికి స‌రైన‌ సమయం. #గెహ్ర‌యాన్ ఆన్ ప్రైమ్ .. జ‌న‌వ‌రి 25న వరల్డ్ ప్రీమియర్ జ‌ర‌గ‌నుంది” అని వెల్ల‌డించారు.

విడుదలైన టీజర్ లో బోలెడ‌న్ని ట్విస్టులు బ‌య‌ట‌పడ్డాయి. హాట్ క‌పుల్స్ (దీపిక - ధైర్య.. అనన్య-సిద్ధాంత్) వారి సంక్లిష్ట సంబంధాలతో లైఫ్ ని సాగిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. దీపిక - సిద్ధాంత్ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడంతో వీడియో ప్రారంభమవుతుంది.. అంత‌లోనే ఇది ముగుస్తుంది. అయితే వారి భాగస్వాములు అనన్య .. ధైర్య భావోద్వేగ క్షణాల్లో కనిపించ‌డం ఇక్క‌డ‌ ట్విస్టు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా- రజత్ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ -వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం గురించి శకున్ మాట్లాడుతూ: “నాకు గెహ్రాయాన్ సినిమా మాత్రమే కాదు. ఇది మానవ సంబంధాలలోని చిక్కుల్లోకి ప్రయాణం.. ఇది ఆధునిక వయోజన సంబంధాలకు అద్దం. భావోద్వేగాల చిట్టడవిలో మనం ఎలా ప్రయాణిస్తాము? మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాలను .. చుట్టుపక్కల వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అన్న‌ది చూపిస్తున్నాం`` అని తెలిపారు. అద్భుతమైన టీమ్ ధర్మ ప్రొడక్షన్స్.. ప్రతిభావంతులైన తారాగణం.. సిబ్బందితో ప‌ని చేశాం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత కరణ్ మాట్లాడుతూ, “గెహ్రైయాన్ ఆధునిక సంబంధాల లో తీవ్రమైన అంశాల‌పై నిజమైన.. నిజాయితీతో కూడుకున్న‌ పరిశీలన. మానవ భావోద్వేగాల సంక్లిష్టతలను చిత్రీకరించడంలో శకున్ అద్భుతమైన వ‌ర్క్ చేసాడు. న‌టీన‌టుల శక్తివంతమైన ప్రదర్శనలతో కలిపి సినిమాను నిజంగా ఆకట్టుకునేదిగా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో గెహ్రైయాన్ ను ప్రీమియర్ చేయడంపై సంతోషిస్తున్నాము. షేర్ షా తర్వాత ఇది మా రెండవ చిత్రం. ప్రేమ మరియు స్నేహం .. ఒకరి ఆశయం.. లక్ష్యాలు పోరాటాలకు సంబంధించిన విశ్వవ్యాప్తంగా ఆకర్షణీయమైన అంశంతో తెర‌కెక్కింది ఈ మూవీ. ఈ చిత్రం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో క‌నెక్ట‌వుతుంద‌ని ఆశిస్తున్నాము`` అని అన్నారు.
Tags:    

Similar News