పాన్ ప్రకటనలపై హీరోల పెళ్లాలకు లేఖలు

Update: 2016-03-02 09:40 GMT
సినిమా హీరోలకు ప్రభుత్వాలు ప్రచారం కోసం వాడుకోవడం కామన్. సులభంగా తమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకు స్టార్స్ కి ఉండే క్రేజ్ ని ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఢిల్లీలో కొలువుదీరిన ఆప్ సర్కార్, దాని అధినేత కేజ్రీవాల్ మాత్రం కొంచెం విభిన్నంగా ఉంటారు. వీరిని కొన్ని ప్రకటనల్లో నటించవద్దని కోరేందుకుగాను.. వారి భార్యలకు లేఖ రాసింది ఆప్ ప్రభుత్వం.

బాలీవుడ్‌ యాక్టర్స్ షారుక్‌ఖాన్‌ - అజయ్‌ దేవగన్ - గోవింద - అర్బాజ్‌ ఖాన్‌ ల భార్యలకు ఆప్‌ సర్కార్ ఓ లెటర్ పంపింది. ఈ నలుగురూ పాన్‌ మసాలా ప్రకటనల్లో నటిస్తున్న వారే. పాన్‌ మసాలా తినడం కారణంగా క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉందని.. వాటి ప్రచార ప్రకటనల్లో నటించవద్దని సూచిస్తూ గతంలో ఆప్‌ ప్రభుత్వం వీరికి లేఖ రాసింది. అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈసారి తమ రూట్ మార్చి.. వారి భార్యలకు లేఖలు రాసింది కేజ్రీ ప్రభుత్వం. కోట్లాది మంది అభిమానుల ఫాలోయింగ్‌ ఉండే షారుక్‌ - అజయ్‌ దేవ్‌గన్‌ లాంటి నటులు పాన్‌ మసాలా లాంటి ప్రకటనల్లో నటిస్తే, ప్రజలను అవి వాడేలా ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వ వాదన.

అవి ప్రాణ హాని కలగజేస్తాయని తెలియజేస్తూ ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాసింది. హీరోలు అలాంటి ప్రకటనల్లో నటించవద్దని మీరైనా చెప్పండి అంటూ రాసిన లేఖలను ఆయా నటుల భార్యలకు పంపారు. ఇలాంటి లెటర్ ను ఢిల్లీ ప్రభుత్వం గతంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోన్ కి కూడా పంపడం గమనించాలి.
Tags:    

Similar News