ప్రమాదంలో టాలెంటెడ్ డైరెక్టర్ కెరీర్

Update: 2015-09-30 09:30 GMT
‘వెన్నెల’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ‘ప్రస్థానం’ లాంటి గొప్ప సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు దేవా కట్టా. ‘ప్రస్థానం’ సినిమా తర్వాత టాలీవుడ్‌ కు ఓ గొప్ప డైరెక్టర్ దొరికాడంటూ అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. స్టార్ల ఫ్యామిలీస్ నుంచి కూడా అతడికి పిలుపులు వచ్చాయి. మంచి అవకాశాలు లైన్ లో నిలిచాయి. కానీ ఒక్క సినిమా అతడి ఫేట్ మార్చేసింది. చాలా కాంట్రవర్శీలున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం అతడి కెరీర్ కు శాపమైంది.

ఎలాంటి దర్శకుడికైనా ఫ్లాప్ రావడం సహజం. ఒక్క ఫ్లాప్ తో కథ ముగిసిపోదు. కానీ ‘ఆటోనగర్ సూర్య’ మాత్రం దేవా కట్టాకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. పది కోట్లలోనే సినిమాను ముగించినా.. పాతిక కోట్లు ఖర్చు చేయించానంటూ తనపై దుష్ప్రచారం చేశారంటూ ఈ మధ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు దేవా. కంటెంట్ విషయంలో దేవా తప్పులు చేసినప్పటికీ.. ఆ ఫ్లాప్ తాలూకు దుష్ప్రభావం అందరికంటే దేవా మీదే పడింది.

ఇలాంటి సమయంలో దేవా సొంత కథతో తనేంటో రుజువు చేసుకునే ప్రయత్నం చేయాల్సింది. కానీ మొహమాటానికి పోయి మంచు విష్ణుతో ‘డైనమైట్’ చేశాడు. ఆ సినిమా హిట్టయినా రీమేక్ కాబట్టి అతడికి పేరు వచ్చేది కాదు. ఇప్పుడతను ఫ్లాప్ భారాన్ని మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. దర్శకుడిగా ఈ సినిమాకు అతను కొత్తగా చేసిందేమీ లేకపోయినా వరుసగా రెండు పెద్ద ఫ్లాపులిచ్చాడన్న ముద్ర మాత్రం పడిపోయింది. అసలే ‘ఆటోనగర్ సూర్య’ కొట్టిన దెబ్బకు కోలుకోలేకుండా  ఉంటే.. ‘డైనమైట్’ దేవా కెరీర్ ను మరింత  ప్రమాదంలోకి నెట్టింది. ఇప్పుడతడి దగ్గర మూణ్నాలుగు కథలు రెడీగా ఉన్నాయి. కానీ సినిమా తీయడానికి నిర్మాతలే దొరకట్లేదు. మంచి టాలెంట్ ఉన్న ఈ దర్శకుడిని ఏ అభిరుచి ఉన్న నిర్మాత ఆదుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News