చిరంజీవి 150వ సినిమా `ఖైదీ నంబర్ 150` సెట్ కి మొదట్నుంచీ అతిథుల తాకిడి ఎక్కువే. రోజూ ఎవరో ఒకరు సెట్‌కి వెళ్లి చిరంజీవిని కలిసి ఆయనతో సెల్ఫీ తీసుకొని వచ్చేస్తుంటారు. తీరా వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెట్టి అందరికీ చూపిస్తుంటారు. చిరు రీ ఎంట్రీ సినిమా ఇదే కావడం, సుదీర్ఘకాలం ఆయన తర్వాత సెట్లో మళ్లీ మేకప్ వేసుకొని ఎలా కనిపిస్తున్నారనే క్యూరియాసిటీ కొద్దీ అక్కడికి వెళుతుంటారు సెలబ్రిటీలు. అయితే బయటి వ్యక్తులే కాదు, సినిమా బృందంలోని వ్యక్తులు కూడా వీలు కుదిరినప్పుడంతా చిరు దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకొంటుంది. ఆ రకంగా చిరు లుక్కులు చాలా వరకు బయటికొచ్చాయి. ఐటెమ్ సాంగ్ చేసిన లక్ష్మీరాయ్ మొదలుకొని పలువురు నటీనటులు - టెక్నికల్ టీమ్‌లోని సభ్యులు చిరుతో కలిసి తీయించుకొన్న సెల్ఫీలు బయటపెట్టారు. అవి పెద్దయెత్తున వైరల్ అయ్యాయి. తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా చిరుని కలిశారు. పాట కోసం గెటప్పులో ఉండగానే చిరుతో ఓ ఫొటో తీయించుకొని ట్విట్టర్ లో పెట్టాడు దేవి. అందులో చిరు లుక్కు అదిరిపోయేలా కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్కుల్ని చూసుకొని మరింత సంబరపడిపోతున్నారు.