సునీల్ 'కనబడుటలేదు' మెప్పించిందా..?

Update: 2021-08-19 14:30 GMT
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో.. వారానికి అర డజను చొప్పున చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గురువారం మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో ''కనబడుటలేదు'' క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో సుక్రాంత్‌ వీరెల్ల - వైశాలి రాజ్ - హిమ‌జ‌ - యుగ్ రామ్ - శశిత కోన ఇతర పాత్రలు పోషించారు. ఎమ్. బాలరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

బాయ్ ఫ్రెండ్ సూర్య (సుక్రాంత్) మోసం చేసాడనే బాధలో ఉన్న శశిద (వైశాలి రాజ్‌).. అయిష్టంగా ఆదిత్య (యుగ్‌ రామ్‌) ని వివాహం చేసుకుంటుంది. పెళ్లి త‌ర్వాత కూడా సూర్య చేతిలో మోసపోయాననే అవ‌మాన భారంతో ఉన్న ఆమె.. త‌న భ‌ర్త సహాయంతో చంపేయాల‌ని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరూ క‌లిసి సూర్య కోసం విశాఖ‌ప‌ట్నం వెళ్లగా.. అప్పటికే సూర్య కనిపించడం లేదనే ఊహించ‌ని ట్విస్ట్ ఎదురవుతుంది. సూర్య కనిపించకపోవడానికి కారణమేంటి?, ఈ కేసుని ఛేదించడంలో డిటెక్టివ్ రామ‌కృష్ణ (సునీల్‌) పాత్ర ఏంటి? అనేది 'కనబడుటలేదు' సినిమా కథ.

మొదటి ఆట నుంచే ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మర్డర్‌ మిస్టరీగా ప్రారంభమైన ఈ కథలో డిటెక్టివ్ కామెడీని జోడించడం వల్ల దర్శకుడు దేనికీ న్యాయం చేయలేకపోయారని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. స్టోరీలో కొత్తదనం ఉన్నా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే లేకపోవడం మైనస్ అని అంటున్నారు. ఇందులో సునీల్ హీరో అనేలా ప్రమోషన్స్ చేసినా.. అతని ఎంట్రీ సెకండాఫ్ లో కానీ కనిపించదు.

అయితే సునీల్ వచ్చిన తర్వాతే సినిమాపై ప్రేక్షకుడికి కాస్త ఆసక్తి కలుగుతుందని అంటున్నారు. డిటెక్టివ్ గా సునీల్ చేసే ప‌రిశోధ‌న.. కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటున్నాయి. సునీల్ తన అనుభవంతో చక్కటి నటన కనబర్చారని తెలుస్తోంది. వైశాలిరాజ్‌ - సుక్రాంత్‌ - హిమ‌జ పాత్రలు కూడా అలరిస్తున్నాయి. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా మ్యూజిక్ - ఎడిటింగ్ ఇంకా బెటర్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. మొత్తం మీద దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆకట్టుకునే విధంగా ఆవిష్కరించలేకపోయారని ఆడియన్స్ తీర్పు ఇచ్చారు.
Tags:    

Similar News