'రౌడీ బాయ్స్' తో రిస్క్ చేయడం లేదు కదా..?

Update: 2022-01-10 06:31 GMT
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ప్రస్తుతం తమ ఫ్యామిలీ హీరో డెబ్యూ మూవీ ''రౌడీ బాయ్స్'' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ హోమ్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ప్రస్తుతం భారీ సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు.. వారసుడిని హీరోగా లాంచ్ చేయడానికి బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

'రౌడీ బాయ్స్' చిత్రానికి దిల్ రాజు - శిరీష్ నిర్మాతలుగా హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దీని కోసం దాదాపుగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు టాక్ నడుస్తోంది. ముందుగా తక్కువ బడ్జెట్‌ తోనే ప్లాన్ చేసినప్పటికీ.. ఎక్కువ రోజులు షూటింగ్ మరియు రీషూట్‌ లు సినిమా బడ్జెట్‌ ను పెంచాయని తెలుస్తోంది. కంటెంట్ విషయంలో చాలా కేర్ తీసుకునే దిల్ రాజు.. ఇందులో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయించారని సమాచారం.

ఇటీవల విడుదలైన 'రౌడీ బాయ్స్' మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కాలేజీ నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాలేజ్ లో స్నేహితుల మధ్య చోటు చేసుకునే సరదా అల్లర్లు.. స్టూడెంట్ గ్యాంగ్ వార్స్ - లవ్ అండ్ రొమాన్స్.. ఇలా అన్ని అంశాలను మిళితం చేసి ఈ సినిమాను రెడీ చేసారు. కంటెంట్‌ మీద నమ్మకంతో పోటీ ఎక్కువైనా దిల్ రాజు సంక్రాంతి బరిలో నిలిపుతున్నారని తెలుస్తోంది.

నిజానికి 'రౌడీ బాయ్స్' చిత్రాన్ని సోలోగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లో అక్కినేని నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' వంటి పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో పాటుగా 'హీరో' 'డీజే టిల్లు' సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయినప్పటికీ తెలివైన వ్యాపారవేత్త అనిపించుకున్న దిల్ రాజు తనయుడి లాంచింగ్ మూవీని తగినన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.

నైజాంలో 'బంగార్రాజు' సినిమా కంటే 'రౌడీ బాయ్స్' సినిమాకు ఎక్కువ థియేటర్లు అలాట్ అవడం వెనుక దిల్ రాజు హస్తం ఉందని అంటున్నారు. కాకపోతే అగ్ర నిర్మాత తన డిస్ట్రిబ్యూటర్‌లపై ఒత్తిడి చేయకూడదని నిర్ణయించుకొని.. అన్ని ఏరియాలలో స్వంతంగా సినిమాను విడుదల చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా బడ్జెట్‌ లో కొంతభాగం రికవరీ చేశారట. ఇప్పుడు మిగిలినది థియేట్రికల్ రన్ తో రాబట్టాల్సి ఉంటుంది. మరి మిగతా సంక్రాతి సినిమాలను తట్టుకొని ఈ మూవీ దిల్ రాజుకు ఏ మేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, 'రౌడీ బాయ్స్‌' చిత్రంలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సహిదేవ్ విక్రమ్ - కార్తీక్ రత్నం - శ్రీకాంత్ అయ్యంగార్ - తేజ్ కూరపాటి - కోమలీ ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మధే సినిమాటోగ్రఫీ అందించగా.. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా.. మధు ఎడిటర్ గా వర్క్ చేశారు. టాలీవుడ్ లో దర్శక నిర్మాతల వారసులు హీరోలుగా పెద్దగా సక్సెస్ అవ్వరనే సెంటిమెంట్ ఉంది. మరి ఆశిష్ దాన్ని బ్రేక్ చేసి హీరోగా రాణిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News