ద‌ర్శ‌కుడు మారుతి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!

Update: 2018-09-17 06:27 GMT
ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేయ‌టం.. నిజాయితీని నమ్ముకుంటే ఏదో ఒక రోజు అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలో ఉండే అవ‌కాశం క‌లుగుతుంది. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికే చాలామంది ప్ర‌ముఖులు ఫ్రూవ్ చేశారు. ఇప్పుడు అలాంటి ఉదాహ‌ర‌ణే ద‌ర్శ‌కుడు మారుతిలోనూ క‌నిపిస్తుంది.

యూత్ సినిమాల ద‌ర్శ‌కుడిగా.. ఇటీవ‌ల ఫ్యామిలీ చిత్రాల్ని తీస్తూ.. తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శైల‌జారెడ్డి అల్లుడు సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మారుతి.. త‌న బ్యాక్ గ్రౌండ్ గురించి ఓపెన్ అయ్యారు. ఆయ‌న నేప‌థ్యం గురించి వింటే షాక్ త‌గ‌ల‌ట‌మే కాదు.. ఆయ‌న మీద గౌర‌వం రెట్టింపు ఖాయం,

ఒక సాదాసీదా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మారుతి ఈ రోజు ఈ స్థాయికి చేర‌టానికి ఏం చేశారు?  ఎలా ఆయ‌న చిరు పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీకి యాడ్స్ చేసే వ‌ర‌కూ వెళ్లార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చ‌దివితే మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న నేప‌థ్యం గురించి చెప్పారు.

మాది పేద కుటుంబం. మా నాన్న అర‌టిపండ్ల బండి వేసే వారు. నాన్న చాలా క‌ష్ట‌ప‌డి కుటుంబాన్ని పోషించేవారు. రోజుకు రూ.50 వ‌స్తే చాలా బాగా సంపాదించిన‌ట్లు. నేనుఉద్యోగం చేసేట‌ప్పుడు కూడా ఆయ‌న అర‌టిపండ్ల బండి వేసేవారు. బ‌లవంతం చేసి ఆయ‌న్ను మాన్పించా.

టెన్త్ నుంచి ఏదో ఒక ప‌ని చేసే వాడిని. ఒక ద‌శ‌లో ఆఫీస్ బాయ్ గా ప‌ని చేశా. నిజానికి సినిమా డైరెక్ట‌ర్ ను కావాల‌న్న ఆలోచ‌న అస్స‌లు ఉండేది కాదు. హైద‌రాబాద్‌ లోని నాగేశ్వ‌ర‌రావు హార్ట్ యానిమేష‌న్ అకాడ‌మీకి నా డ్రాయింగ్స్ పంపా. అవి చూసి..వారికి న‌చ్చి స్కాల‌ర్ షిప్ ఇచ్చారు. అలా అందులో రూ.15వేల‌కు చేరా. అక్క‌డ మంచి నైపుణ్యం చూపించేస‌రికి బాగా ఎంక‌రేజ్ చేశారు.

ఆ స‌మ‌యంలోనే బ‌న్నీ ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌ను 2000లో చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు నా ద‌గ్గ‌ర డ్రాయింగ్స్ నేర్చుకున్నాడు. త‌ర్వాత కెన‌డాకు వెళ్లి సెటిల్ అవ్వాల‌నుకున్న స‌మ‌యంలో గంగోత్రిలో ఛాన్స్ వ‌చ్చింది.  అలా ఇండ‌స్ట్రీలో సెటిల్ అయ్యాడు. బ‌న్నీతో ప‌రిచ‌యం పెరిగి.. అది కాస్తా చిరంజీవిని క‌లుసుకునే అవ‌కాశం క‌లిగింది.  ఆయ‌న పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీకి కొన్ని యాడ్స్ ను డిజైన్ చేసి ఇచ్చాను. ఆ ప‌నిని చూసిన చిరు.. నీలో మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడు.. ట్రై చేయ్.. స‌క్సెస్ అవుతావు అన్నారు. ఆయ‌న మాట ఇచ్చిన న‌మ్మ‌క‌మే ఇప్పుడీ స్థాయికి చేరేలా చేసింది.


Tags:    

Similar News