డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ప‌రిస్థితి చిత్రంగా మారిందే?

Update: 2022-11-16 08:45 GMT
టాలీవుడ్ లో ఈ మ‌ధ్య ఒక్కో స్టార్ డైరెక్ట‌ర్ ది ఒక్కో చిత్ర‌మైన స్టోరీగా మారుతోంది. సినిమా ఓకే అయినా ముందు క‌ద‌ల‌ని చిత్ర‌మైన ప‌రిస్థితిలో స్టార్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ వుండ‌గా.. ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ అయినా ఫైన‌ల్ గా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో సినిమా చేసే ఛాన్స్ ల‌భించింద‌ని హ్యాపీగా వున్న వేళ  మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కు అడుగ‌డుగునా అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. మ‌హేష్ SSMB28ని త్రివిక్ర‌మ్ ఇటీవ‌ల ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ నెల‌ల త‌ర‌బ‌డి ఆల‌స్యం అవుతూ ఇటీవ‌లే సెప్టెంబ‌ర్ లో మొద‌లైంది. ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న త‌రువాత సెకండ్ షెడ్యూల్ కోసం బ్రేకిచ్చారు. ఈలోగా త్రివిక్ర‌మ్ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ లో మార్పులు చేసి మ‌హేష్ కి వినిపించాడు. ముందు చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్ ని ప‌క్క‌న పెట్టి మార్పులు చేర్పుల‌తో సినిమాని మ‌ళ్లీ మొద‌టి నుంచి మొద‌లు పెట్టాల‌నుకున్నారు. కానీ రీసెంట్ గా సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి చెంద‌డంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే 'మ‌హ‌ర్షి' త‌రువాత మ‌ళ్లీ మ‌హేష్ తోనే సినిమా చేయాల‌ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేశాడు వంశీ పైడిప‌ల్లి. కానీ మ‌హేష్ బాబుకు వంశీ నెరేట్ చేసిన స్టోరీ న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌న‌తో సినిమాకు అంగ‌కీరించ‌లేదు. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ తో అయినా సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. చ‌ర‌ణ్ 'RRR' చేస్తుండ‌టంతో వంశీ పైడిప‌ల్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేక‌పోయాడు. ఆ త‌రువాత అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ వంటి హీరోల‌ని ట్రై చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు.

వారు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుండ‌టంతో వంశీ పైడిప‌ల్లి విలువైన మూడేళ్లు గ‌డిచిపోయాయి. ఫైన‌ల్ గా దిల్ రాజు స‌ల‌హాతో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో సినిమాకు రెడీ అయ్యాడు. క‌థ చెప్ప‌డం, విజ‌య్ ఓకే చెప్ప‌డం చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ ని త‌మిళ ప్రాజెక్ట్ గానే చూస్తూ, ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు. త‌మిళంలో 'వారీసు'గా రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో 'వార‌సుడు'గా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

ఇదే ఇప్పుడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లికి  కొత్త టెన్ష‌న్ ని తెచ్చిపెడుతోంది. ముందు నుంచి ఇది స్ట్రెయిట్ సినిమా అని, లేదా తెలుగు, తమిళ భాష‌ల్లో చేస్తున్న బైలింగ్వ‌ల్ అని ప్ర‌చారం చేస్తే ఏ గొడ‌వా వుండేది కాదు. కానీ త‌మిళ సినిమా అని చెప్ప‌డంతో టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ ,డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి ఈ మూవీకి వ్య‌తిరేక‌త మొద‌లైంది.

పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాలు మాత్ర‌మే రిలీజ్ చేయాల‌ని , ఆ త‌రువాతే డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించాల‌ని ఓ నిబంధ‌న పెట్టుకున్నారు. అదే ఇప్పుడు వంశీ పైడిప‌ల్లికి పెద్ద త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది. దొర‌క్క దొర‌క్క స్టార్ హీరో దొరికి సినిమా చేస్తే ఈ గొడ‌వేంటి బాసూ అని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఫీల‌వుతున్నాడ‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News