మూవీ రివ్యూ : ‘దొర’

Update: 2016-07-01 15:53 GMT
చిత్రం : ‘దొర’

నటీనటులు: సత్యరాజ్ - శిబిరాజ్ - బింధుమాధవి - కరుణాకరన్ - రాజేంద్రన్ తదితరులు
సంగీతం: సిద్దార్థ్ విపిన్
ఛాయాగ్రహణం: యువరాజ్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత: జక్కం జవహర్ బాబు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ధరణిధరన్

తెలుగులో ఏ తమిళ హీరోకైనా కాస్తంత పేరొచ్చిందంటే చాలు.. తర్వాత వరుసగా ఆ హీరో తమిళ సినిమాలన్నీ తెలుగులోకి దించేస్తుంటారు. ఐతే ఇప్పటిదాకా హీరోల విషయంలోనే ఇది జరిగింది కానీ.. ఇప్పుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు సినిమాను కూడా తమిళం నుంచి తెలుగులోకి తెచ్చేశారు. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సత్యరాజ్ కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ సినిమా ‘జాక్సన్ దురై’ని ‘దొర’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ‘దొర’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చాడో చూద్దాం పదండి.

కథ:

దొరపురం అనే పల్లెటూర్లో వందల ఏళ్లుగా పాడుబడి ఉన్న బంగ్లా ఉంటుంది. దానికి దయ్యాల కొంప అనే పేరుంటుంది. ఇందులోని దయ్యాల భయానికి రాత్రి 9 దాటాక ఆ గ్రామస్థులెవ్వరూ బయటికి రారు. ఐతే ఆ ఊరి పెద్దమనిషి కూతురైన విజ్జి (బింధుమాధవి) ఎలాగైనా ఈ దయ్యాల సంగతి తేల్చాలని.. ప్రభుత్వానికి పిటిషన్ పెట్టడంతో సత్య (శిబిరాజ్) అనే ఎస్సై ఆ ఊరికి వస్తాడు. దయ్యాల సంగతేంటో తేల్చే క్రమంలో సత్య.. విజ్జి ప్రేమలో పడతాడు. ఆ సంగతి ఆమె తండ్రికి చెబితే.. వారం రోజుల పాటు ఆ దయ్యాల కొంపలో ఉండి రావాలని షరతు పెడతాడు. దీంతో తన స్నేహితుణ్ని తీసుకుని ఆ బంగ్లాలోకి వెళ్తాడు సత్య. మరి అక్కడ నిజంగా దయ్యాలున్నాయా.. ఉంటే ఆ దయ్యాల కథేంటి.. చివరికి సత్య ఆ ఇంటి నుంచి బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం కష్టం అంటారు. ఈ రసాన్ని పండించడానికి ఫిల్మ్ మేకర్స్ రకరకాల మార్గాల్ని అన్వేషిస్తుంటారు. కొన్నేళ్ల కిందట అలా కొత్తగా పుట్టుకొచ్చిన మార్గమే.. హార్రర్ కామెడీ. గత కొన్నేళ్లలో తెలుగు-తమిళ భాషల్లో ఈ జానర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఐతే మొదట్లో ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించిన ఈ జానర్.. తర్వాత తర్వాత మాత్రం మొహం మొత్తేసింది. దీనికి కారణం.. హార్రర్ కామెడీ అనగానే ప్రతి కథా ఒకేలా ఉంటుండటమే.

ఓ పల్లెటూర్లో ఓ పెద్ద బంగ్లా ఉంటుంది. అందులో దయ్యాలున్నాయని జనాలు భయపడుతుంటారు. ఐతే హీరో ఆ దయ్యాల సంగతేంటో చూస్తానని రంగంలోకి దిగుతాడు. ఓ కామెడీ బ్యాచ్ ను వేసుకుని అందులోకి దిగుతాడు. ఇక దయ్యాలు ఆ బ్యాచ్ తో ఆటాడుకుంటాయి. దయ్యాలు వాళ్లను కొడుతుంటే మనం నవ్వుకోవాలి. మధ్యలో దయ్యాల ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుస్తుంది. చివరికి ఆ దయ్యాలకు విముక్తి కల్పించడంతో కథ ముగుస్తుంది. ఈ కథతో తెలుగు-తమిళ భాషల్లో ఎన్ని సినిమాలొచ్చాయో చెప్పడం కష్టం.

‘దొర’ కథ కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండదు. అవే దయ్యాలు.. అదే బాదుడు.. తెరమీద దయ్యాల దెబ్బకు వాళ్లు వణికి చస్తుంటే మనం విరగబడి నవ్వుకోవాలన్నమాట. కాకపోతే ఇప్పటిదాకా చూసిన దయ్యాలకు.. ఇందులోని దయ్యాలకు కొంచెం తేడా ఉంటుంది. ‘దొర’లో ఇంగ్లిష్ దయ్యాలు కూడా ఉంటాయి. ఆ దయ్యాలకు.. మన ఇండియన్ దయ్యాలకు మధ్య పోరు సాగుతుంటుంది. హీరో.. అతడి స్నేహితుడు వాళ్ల మధ్య ఇరుక్కుంటారు. బ్రిటిష్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్.. దయ్యాలు తమ గతమేంటో తెలియక మెమొరీ లాస్ పేషెంట్ల తరహాలో రోజూ ఒకేతరహాలో గొడవ పడటం.. ఇప్పటిదాకా చూసిన హార్రర్ కామెడీలకు కొంచెం భిన్నంగా అనిపిస్తాయి కానీ.. ఈ కాన్సెప్ట్ ను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

కామెడీ సినిమా అయినంత మాత్రాన కథ సీరియస్ గా ఉండాల్సిన పని లేదు.. కథాకథనాల్ని ఎంత సిల్లీగా నడిపించినా చెల్లిపోతుంది అనుకుంటే పొరబాటే. కామెడీ కోసమని ఒక లాజిక్ అంటూ లేకుండా.. మరీ సిల్లీగా కథనాన్ని నడిపించడంతో ‘దొర’ ఎంగేజింగ్ గా అనిపించదు. ముందు దయ్యాల్ని చూస్తే భయం కలగాలి.. ఆ భయం తర్వాత కామెడీ పుడుతుంది. కానీ ఇందులో దయ్యాల్ని మరీ తమాషాగా మార్చేశారు. దయ్యాల్ని ఇందులోని పాత్రలు మరీ కామెడీగా తీసుకుంటాయి. కానీ మధ్య మధ్యలో ఇవి దయ్యాలని గుర్తుకొచ్చి వణికిపోతుంటాయి. అక్కడక్కడా కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం ‘దొర’ ఒక సిల్లీగా అనిపిస్తుంది.

సత్యరాజ్ మీద బోలెడన్ని ఆశలతో థియేటరుకి వెళ్లినవాళ్లకు నిరాశ తప్పదు. ఆయన సినిమాలో కనిపించేది మహా అయితే ఓ గంట. అందులోనూ ఆయన్నుంచి ఆశించినంత వినోదం అందదు. సత్యరాజ్ అందర్లో ఒకడిలా ఉంటాడు తప్ప.. ఆయన ప్రత్యేకతేమీ కనిపించదు. గెటప్ వరకు మాత్రం బాగుంది కానీ.. సత్యరాజ్ పాత్రను మాత్రం సరిగా తీర్చిదిద్దలేదు. బ్రిటిష్ కాలం నేపథ్యంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. కరుణాకర్ పాత్ర చుట్టూ అల్లుకున్న వినోదం మాత్రం బాగుంది. సత్యరాజ్ బృందం రోజూ ప్రతిరోజూ చెప్పిన డైలాగులే చెబుతూ.. బ్రిటష్ దొర మీద యుద్ధానికి వెళ్లే సన్నివేశాలు కొంచెం నవ్విస్తాయి. క్లైమాక్స్ చాలా మామూలుగా అనిపిస్తుంది. ఇదే సినిమాను తెలుగు నటీనటులతో చూస్తే కొంచెం భిన్నమైన అనుభూతి కలిగేదేమో కానీ.. అందరూ పరభాషా నటులు కావడం.. మనం ఎంతో ఆశించే సత్యరాజ్ పాత్ర సినిమాలో నామమాత్రంగా మారిపోవడంతో ‘దొర’ మన ప్రేక్షకులకు కనెక్టవడం కష్టం.

నటీనటులు:

సత్యరాజ్ బాగా చేయలేదు అనడానికేమీ లేదు కానీ.. ఆయన పాత్రలోనే విషయం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆయన పాత్రను మరీ పేలవంగా తీర్చిదిద్దారు. దయ్యం పాత్రలో ఆయన గెటప్.. నటన కొన్ని సన్నివేశాల్లో బాగా అనిపిస్తాయి. సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ ను చూస్తే ఏ ఫీలింగ్ కలగదు. అతను హీరోగా తమిళంలో ఎందుకు అంతగా పేరు తెచ్చుకోలేకపోయాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అతడి నటనలో ఏ విశేషం లేదు. బిందుమాధవి గురించి చెప్పడానికేమీ లేదు. ఆమెది డమ్మీ పాత్ర. అందర్లోకి కరుణాకరన్ ఒక్కడే తన పాత్రకు న్యాయం చేశాడు. గుండు రాజేంద్రన్ పర్వాలేదు.

సాంకేతికవర్గం:

‘దొర’కు సాంకేతిక విభాగాలు మాత్రం బలంగా నిలిచాయి. సిద్దార్థ్ విపిన్ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. యువరాజ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. ఈ రెండు విభాగాలూ మంచి పనితనం కనబరచడంతో కొన్ని సన్నివేశాల్లో విషయం లేకపోయినా.. పర్వాలేదనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా మంచి క్వాలిటీతో తెరకెక్కింది. శశాంక్ వెన్నెలకంటి మాటలు పర్వాలేదు. తమిళ సినిమా అయినా తెలుగు టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దర్శకుడు ధరణిధరన్.. కథ విషయంలో భిన్నంగా ఆలోచించాడు కానీ.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించే విషయంలో విఫలమయ్యాడు. ఈ కథను ఎలా చెప్పాలనే విషయంలో అతను బాగా కన్ఫ్యూజ్ అయినట్లున్నాడు. ధరణిధరన్ నరేషన్ సిల్లీగా అనిపిస్తుంది.

చివరగా: రొటీన్ దయ్యాల గోలే ‘దొరా’...

రేటింగ్: 2/5
Tags:    

Similar News