'ఫౌజీ' తర్వాత ఇమాన్వి లైనప్‌ చూస్తే షాక్‌

ప్రభాస్‌ సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యే వరకు మరే సినిమాకు కమిట్‌ కావద్దని ఇమాన్వితో ఒప్పందం ఉంది.

Update: 2025-01-09 06:30 GMT

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఇమాన్వి ఇస్మాయిల్‌ను హను రాఘవపూడి తన ఫౌజీ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వి ఎంపికను చాలా మంది తప్పబట్టారు. కానీ మెల్లమెల్లగా ఆమెకు వస్తున్న పాపులారిటీ చూస్తే మతి పోతుంది. ప్రభాస్ వంటి బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌కి జోడీగా సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకున్న అమ్మాయిని తీసుకోవడం ఏంటో అంటూ పెదవి విరిచిన వారే ఇప్పుడు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్‌ సినిమా పూర్తి అయ్యి విడుదల అయ్యే వరకు మరే సినిమాకు కమిట్‌ కావద్దని ఇమాన్వితో ఒప్పందం ఉంది. లేదంటే ఇప్పటి వరకు ఆమె చేతిలో పది సినిమాలు ఉండేవి.

ఫౌజీ సినిమా నిర్మాతల్లో ఒకరైన భూషన్‌ కుమార్‌ తన హిందీ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్‌ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా రూపొందబోతున్న యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను భూషన్ కుమార్‌ నిర్మించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్తీక్‌ ఆర్యన్‌కు జోడీగా ఇమాన్వి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎంపిక చేశారని తెలుస్తోంది. ఫౌజీ సినిమా వచ్చిన కొన్ని నెలల తర్వాత కార్తీక్‌ ఆర్యన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సినిమా పూర్తి చేసిన తర్వాతే కార్తీక్‌ ఆర్యన్‌ సినిమా షూటింగ్‌లో ఇమాన్వి జాయిన్ కాబోతుందట.

ప్రభాస్ ఫౌజీ సినిమాకు చాలా తక్కువ పారితోషికం అందుకుంటున్న ఇమాన్వి తదుపరి సినిమాలకు కోటికి తక్కువ కాకుండా పారితోషికం అందుకోబోయింది. ఈమధ్య కాలంలో హీరోయిన్స్ పారితోషికం కోటి మామూలు విషయం. కానీ ఇమాన్వి ఇంకా ఒక్క సినిమా పూర్తి చేయలేదు, ఒకే సినిమాలో చేస్తున్నా రెండో సినిమాకే కోటికి మించి పారితోషికం దక్కించుకోవడం అరుదైన విషయం. ప్రభాస్ వంటి ఇండియాస్ బిగ్గెస్ట్‌ స్టార్‌తో చేయడం వల్లే ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌కి సూపర్ హిట్ దక్కడం మాత్రమే కాకుండా హీరోయిన్‌గా మంచి పేరును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

మృణాల్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఇమాన్వి బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ వరుసగా రాబోయే రోజుల్లో సినిమాలు చేయబోతుంది. ఇప్పటి వరకు ఫౌజీ కాకుండా మరే సినిమాకు ఆమె కమిట్‌ కాలేదు. ఫౌజీ నిర్మాతలతో ఉన్న ఒప్పందం కారణంగా ఇమాన్వి ఇతర నిర్మాతలకు అధికారికంగా ఓకే చెప్పడం లేదు. కానీ అనధికారికంగా ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు సినిమాలు, టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు, కోలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు దాదాపుగా ఫైనల్‌ అయ్యాయి. ఫౌజీ తర్వాతే అధికారికంగా ఒప్పందం చేసుకుందాం అంటూ ఆమెకు లక్షల్లో అడ్వాన్స్‌లు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాబోయే రెండు మూడు ఏళ్లలో ఇమాన్వి ఫుల్‌ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫౌజీ హిట్‌ అయితే ఆమె పారితోషికం రెండు నుంచి నాలుగు కోట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News