నాగార్జున పరువు నష్టం కేసు: కోర్టులో మంత్రి కొండా సురేఖ

ఇవాళ స్పెషల్ జడ్జి ముందు కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు వినిపించనున్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తన కుటుంబానికి మానసికంగా గాయపరచాయని నాగార్జున కోర్టుకు తెలిపారు

Update: 2025-02-13 07:30 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నేడు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు. కొండా సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, నాగార్జున న్యాయపరమైన చర్యలకు దారితీశారు. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణలో ఉంది.

ఇవాళ స్పెషల్ జడ్జి ముందు కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు వినిపించనున్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తన కుటుంబానికి మానసికంగా గాయపరచాయని నాగార్జున కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమె సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుల వల్ల మరింత చర్చనీయాంశమయ్యాయని కూడా గత విచారణలో ఆయన న్యాయవాది వాదనలో తెలిపారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు కేవలం తన అభిప్రాయం మాత్రమేనని, ఎవరినీ కించపరచే ఉద్దేశం లేదని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

ఈ కేసు వివాదం అక్కినేని కుటుంబం మరియు సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కొండా సురేఖ గతంలో నాగచైతన్య-సమంత విడాకులపై కేటీఆర్ పేరు ప్రస్తావించడం వివాదానికి కారణమైంది. ఆమె వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపడంతో నాగార్జున సీరియస్‌గా స్పందించి న్యాయపరమైన దారిని ఎంచుకున్నారు. ఈ వివాదంపై సినీ, రాజకీయ వర్గాలు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇక ఇదివరకు జరిగిన వాదనలో నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి, మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం అని కోర్టుకు వివరించారు. సురేఖ గతంలో సోషల్ మీడియాలో క్షమాపణలు కోరినా, ఆ వ్యాఖ్యల ప్రభావం నాగార్జున కుటుంబంపై తీవ్రంగా ఉందని తెలిపారు. అందుకే ఈ పరువు నష్టం కేసులో కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక, కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కూడా ఇదివరకే వివాదంపై ఒక వివరణ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని వాదించారు. ఆమె ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచలేదని, కేవలం సామాజిక పరిస్థితులపై అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇక ఇప్పుడు కోర్టు ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న తర్వాత ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News