పవన్ కళ్యాణ్ నుంచి ఆ విషయం నేర్చుకోవాల్సిందే!
హీరోయిన్లు ఎవరైనా సరే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్తారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడే సెటిలైపోయింది.
హీరోయిన్లు ఎవరైనా సరే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్తారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడే సెటిలైపోయింది. మున్నా మైఖెల్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమకు పరిచయమైన నిధికి ఆ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలొచ్చాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది.
తాను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చానని, సినిమాల్లోకి రావడమే తనకు సక్సెస్ తో సమానమని చెప్తున్న నిధి, తాను నమ్మిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుని, వాటిపైన మాత్రమే ఫోకస్ చేస్తానని అంటోంది. వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడానికి తానేమీ హీరోని కాదని, ఒకవేళ అలా చేసినా అన్నీ ఒకే తరహా సినిమాలు చేస్తున్నానని విమర్శిస్తారని, అందుకే గొప్ప కథలను ఎంచుకుని మరీ చేస్తున్నట్టు నిధి పేర్కొంది.
అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి యంగ్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చిన నిధి ఒక్క స్టార్ హీరోతో కూడా కలిసి నటించింది లేదనుకుంటున్న టైమ్ లో అమ్మడికి ఒకేసారి పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లుతో పాటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో అవకాశాలొచ్చాయి.
ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సరసన ఛాన్స్ రావడంతో నిధి కెరీర్ టర్న్ అయిపోతుందనుకున్నారంతా. కానీ ఆ సినిమాలు ఇప్పటివరకు రిలీజైంది లేదు. ఏదో కారణాలతో సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో చేసేదేమీ లేక నిధి ఆ సినిమాల రిలీజుల కోసం వెయిట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఆ ఇద్దరు హీరోలతో కలిసి నటించిన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ను నిధి తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
వీరమల్లు కోసం తాను ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కథక్ నేర్చుకున్నానని, పవన్ తో కలిసి నటించే అవకాశం రావడమే తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పిన ఆమె, ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ అని చెప్పగానే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తన పాత్రలోకి వెళ్తారని, ఆయన్ను చూసి ఆ క్వాలిటీని అలవాటు చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది నిధి.
ఇక రాజా సాబ్ గురించి చెప్తూ తనకు హార్రర్ సినిమాలంటే భయమని, ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసమే ఈ సినిమాను ఒప్పుకున్నట్టు చెప్పిన నిధి, ప్రభాస్ ఒక ఫన్నీ పర్సన్ అని చెప్పింది. హరిహర వీరమల్లు, రాజా సాబ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో తాను కూడా అంతే ఎదురుచూస్తున్నట్టు తెలిపింది నిధి అగర్వాల్.