హరీష్ శంకర్.. ఈ హీరో సెట్టయితే గోల్డెన్ హిట్టే!

హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ‘గబ్బర్ సింగ్’ ట్యాగ్ మాత్రం అతనికి దూరం కాలేదు. రీమేక్ సినిమాలు చేస్తాడు అనే ముద్ర కూడా ఉంది.

Update: 2025-02-13 10:30 GMT

హరీష్ శంకర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ‘గబ్బర్ సింగ్’ ట్యాగ్ మాత్రం అతనికి దూరం కాలేదు. రీమేక్ సినిమాలు చేస్తాడు అనే ముద్ర కూడా ఉంది. అయితే అతని కెరీర్‌లో మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం.. లాంటి ఒరిజినల్ మాస్ కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ హిట్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా తరువాత హరీష్ నుంచి ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ రాలేదు.

DJ వంద కోట్లను టచ్ చేసింది అంటారు కానీ హరీష్ మార్క్ సినిమా కాదనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మళ్లీ గబ్బర్ సింగ్ క్రేజ్ ను క్రాక్ చేయాలనే పవన్‌తోనే మరో రీమేక్ కథను లైన్‌లో పెట్టాడు. తమిళంలో హిట్టయిన తెరి కథను కొత్తగా చూపించాలని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను సెట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కొంత షూటింగ్ జరిపినప్పటికీ, ప్రాజెక్ట్‌పై ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

షూటింగ్ కూడా స్లోగా సాగుతోంది. పవన్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ కారణంగా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేదు. ఆ సినిమా ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియక, హరీష్ మధ్యలో మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘రెయిడ్’ రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్’ చేశాడు. కానీ ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు పవన్ సినిమా మరింత ఆలస్యమవుతుండటంతో హరీష్ మరో హీరోని ట్రై చేస్తున్నాడు.

గోల్డ్ ఫేస్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణపై హరీష్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బాలయ్యతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ కోసం హరీష్ శంకర్ స్టోరీ రెడీ చేశాడట. ఈ కథను బాలయ్యకు వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందని సినీ వర్గాల టాక్. హరీష్ ఈసారి రీమేక్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి, బాలయ్య కోసం ఓ ఒరిజినల్ మాస్ కథతో రెడీ అయ్యాడని తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 'కేవీఎన్ ప్రొడక్షన్స్' సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థ ప్రస్తుతానికి యశ్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో ‘టాక్సిక్’ అనే భారీ సినిమా రూపొందిస్తోంది. ఇప్పుడు తెలుగులోనూ ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తూ బాలయ్య-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి.

ఇక హరీష్ శంకర్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే, బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సినిమాలు వరుసగా హిట్స్ కావడంతో బాలయ్య క్రేజ్ పీక్‌లో ఉంది. ఇలాంటి టైంలో హరీష్ శంకర్ ఒక సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్‌తో రావడమంటే, హిట్ రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News