రీ రిలీజ్‌లో అతి పెద్ద డిజాస్టర్‌

ఈ మధ్య కాలంలో అక్కడ రీ రిలీజ్‌ అవుతున్న సినిమాలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా కత్రీనా కైఫ్‌ హీరోయిన్‌గా నటించిన 'నమస్తే లండన్‌' సినిమా రీ రిలీజ్ అయింది..;

Update: 2025-03-15 18:30 GMT

సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ అనేది సర్వసాధారణం. ఈమధ్య కాలంలో టాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు రీ రిలీజ్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు ఫ్లాప్‌ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్న రీ రిలీజ్‌లను మనం చూస్తున్నాం. ఈమధ్య కాలంలో అత్యధికంగా వసూళ్లు సాధించిన రీ రిలీజ్లు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ రీ రిలీజ్‌కి అడ్డాగా మారింది. మురారి, ఆరెంజ్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు సైతం రీ రిలీజ్‌లో భారీ వసూళ్లు నమోదు చేశాయి.

తెలుగులో ఈ నెలలోనూ మరిన్ని సినిమాలు రీ రిలీజ్‌కి సిద్ధం అవుతున్నాయి. రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా నాయక్‌ సినిమాను రీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి రీ రిలీజ్ మినిమం వసూళ్లు రాబడుతూ దూసుకు పోతున్న విషయం తెల్సిందే. కానీ బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అక్కడ రీ రిలీజ్‌ అవుతున్న సినిమాలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా కత్రీనా కైఫ్‌ హీరోయిన్‌గా నటించిన 'నమస్తే లండన్‌' సినిమా రీ రిలీజ్ అయింది.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

నమస్తే లండన్‌ సినిమాను మార్చి 14న రీ రిలీజ్‌ చేశారు. సాధారణంగా తెలుగు సినిమాలు రీ రిలీజ్ అనగానే ఓ రేంజ్‌లో స్పందన వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్‌ సైతం అదే తీరున జరుగుతుంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి అలా లేదు. నమస్తే లండన్‌ సినిమాకు ఆధరణ కరువైంది. దేశవ్యాప్తంగా 75 కి పైగా షోలు వేసినప్పటికీ కేవలం 985 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. హోలీ సెలవు రోజు అయినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గతంలో వచ్చి సూపర్‌ హిట్ అయిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ నమస్తే లండన్‌ మాత్రం రీ రిలీజ్‌లో డిజాస్టర్‌గా నిలిచిందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.

2007లో వచ్చిన సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే సినిమా కమర్షియల్‌గా ఇప్పుడు జనాలకు చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయని రీ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు కూడా సినిమాను జనాలు చూడటం లేదు. ఓటీటీలో ఉండటంతో పాటు, టీవీలో చాలా సార్లు రావడంతో నమస్తే లండన్‌ను జనాలు లైట్‌ తీసుకున్నారు. బాలీవుడ్‌లో ఇకపై ఇలాంటి రీ రిలీజ్ ప్రయత్నాలు చేయడం మానుకుంటే మంచిది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రీ రిలీజ్ కోసం చేసిన ఖర్చులో కనీసం 50 శాతం కూడా రాలేదనే టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News