స్టూడియోగా పాత ఇల్లు.. స్టార్ క‌పుల్ క్రియేటివిటీ

ఈ జంట ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెన్నైలో కొత్తగా పునర్నిర్మించిన స్టూడియో కం నివాసాన్ని చూపించారు;

Update: 2025-03-15 19:35 GMT

ఏదైనా పాత వ‌స్తువును క్రియేటివ్ గా డిజైన‌ర్ లుక్ లోకి మార్చేయ‌డం సులువే కానీ.. ఒక‌ పాత ఇంటిని కొత్త స్టూడియోగా మార్చ‌డం అంత సులువు కాదు. ఇది అధిక వ్య‌య ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న‌ది. కానీ అలాంటి ప్ర‌యాస‌ను అందంగా అనుకూలంగా మ‌లిచారు స్టార్ క‌పుల్ న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ జంట‌. వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించేందుకు ఎంతో తెలివైన ప్లాన్ తో ముందుకు సాగారు.

ఈ జంట ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెన్నైలో కొత్తగా పునర్నిర్మించిన స్టూడియో కం నివాసాన్ని చూపించారు. పాత ఇంటిని ఏడు వేల‌ చదరపు అడుగుల స్టూడియోగా మార్చారు. తాజాగా రిలీజ్ చేసిన ఫోటోలు వీడియోలు ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నాయి. ఈ స్టూడియో అధునాత‌నంగా క‌నిపిస్తూనే, బ్రిటీష్ కాలం నాటి అనుభూతిని క‌లిగించేలా ప్లాన్ చేసారు. విశాల‌మైన గ‌దులు కిటికీలు ఎత్త‌యిన పైక‌ప్పుతో ఇది ఎంతో అందంగా క‌నిపించింది. పాత వస్తువులు, చెక్క శిల్పాలు, టేకు కలపతో చేసిన ఫర్నిచర్‌తో సహజమైన ఇంటీరియర్‌లు ఆక‌ట్టుకున్నాయి. చెన్నైలోని వీనస్ కాలనీలో ఈ స్టూడియో ఉంది.

ఇదే స్టూడియోలో ఒక కాన్ఫరెన్స్ రూమ్, అతిథులకు రూమ్, సందర్శకుల కోసం ఒక లివింగ్ రూమ్, వారి సిబ్బందికి బెడ్‌రూమ్‌లు, పార్టీలకు సౌకర్యవంతమైన లాంజ్, ఒక పెద్ద అవుట్‌డోర్ ఏరియా, అవుట్‌డోర్ డైనింగ్ స్పేస్, ఒక మీటింగ్ రూమ్, నయనతార - విఘ్నేష్ కోసం ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. మొత్తానికి న‌య‌న‌తార - విఘ్నేష్ జంట త‌మ నిర్మాణ సంస్థ కార్య‌కలాపాల‌ను చాలా తెలివిగా వేగంగా విస్త‌రిస్తున్నార‌ని, త‌మ బ్రాండ్ల‌కు విస్త్ర‌తమైన మైలేజ్ తెచ్చేందుకు చాలా శ్ర‌మిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. నయనతార - విఘ్నేష్ 9 జూన్ 2022న వివాహం చేసుకున్నారు. ఈ జంట‌కు ఉయిర్ - ఉలాగ్ అనే కవల కుమారులు ఉన్నారు.

Tags:    

Similar News