మూవీ రివ్యూ: ‘డోర’

Update: 2017-04-01 12:01 GMT
చిత్రం: ‘డోర’

నటీనటులు: నయనతార - తంబి రామయ్య హరీష్ ఉత్తమన్ - సులైల్ కుమార్ తదితరులు
సంగీతం: వివేక్ శివ - మెర్విన్ సాల్మన్
ఛాయాగ్రహణం: దినేశ్ కృష్ణన్
నిర్మాత: మాల్కాపురం శివకుమార్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: దాస్ రామస్వామి

హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన తార నయనతార. గత ఏడాది ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మయూరి’ తమిళ.. తెలుగు భాషల్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే కోవలో మరో హార్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నయన్. ఆ సినిమానే.. డోర. దాస్ రామస్వామి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

పారిజాతం (నయనతార) ఆత్మవిశ్వాసం.. ఆత్మాభిమానం ఎక్కువున్న అమ్మాయి. తన తండ్రితో కలిసి జీవిస్తున్న ఆమె.. బంధువుల నుంచి ఎదురైన ఓ అవమానాన్ని తట్టుకోలేక సొంతంగా కార్ రెంటల్ సర్వీస్ మొదలుపెట్టి తనేంటో రుజువు చేసుకోవాలనుకుంటుంది. అందులో భాగంగా ఒక వింటేజ్ కారు కొని ఇంటికి తీసుకెళ్తుంది. ఐతే ఆ కారును తీసుకొచ్చాక పారిజాతానికి సమస్యలు మొదలవుతాయి. ఓ దయ్యం ఆ కారును ఆవహించి ఉంటుంది. అది హత్యలు చేయడం మొదలుపెడుతుంది. ఇంతకీ ఆ దయ్యం ఎవరు.. దాని కథేంటి.. పారిజాతం ఈ కారు తెచ్చిన ఇబ్బందుల నుంచి పారిజాతం ఎలా బయటపడింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

గత కొన్నేళ్లుగా హార్రర్ కామెడీ జానర్ ఇటు తెలుగులో.. అటు తమిళంలో బాగా పాపులర్ అయింది. ఈ జానర్లో వచ్చిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. కాకపోతే సమస్య ఏంటంటే.. దయ్యం నేపథ్యంలో సినిమా అనగానే మూల కథలన్నీ కూడా ఒకే రకంగా ఉంటున్నాయి. ఎవరో ఒకరు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం.. ఆ తర్వాత మరొకరిలోకి ఆత్మగా ప్రవేశించి తనను చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం.. ఇదే కథగా ఉంటోంది. ‘డోర’ కథాంశం కూడా ఇలాంటిదే. కాకపోతే ఇక్కడ దయ్యంగా మారేది ఒక కుక్క కావడం విశేషం. ఆ కుక్క ఒక కారును ఆవహించి దాని ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇలా మనుషులు కాకుండా ఓ కుక్కని.. ఓ కారుని ప్రధాన పాత్రలుగా చేయడం కొత్త విషయమే కానీ.. మిగతా వ్యవహారమంతా రొటీన్ గా ఉండటం వల్ల సినిమా ఏమీ కొత్తగా అనిపించదు. పైగా చాలా మామూలు సన్నివేశాలతో.. రొటీన్ గా కథనాన్ని నడిపించేయడంతో ‘డోర’ ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. ఇది సగటు హార్రర్ సినిమానే.

‘డోర’ సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించేది నయనతారే. ఆమె తన వరకు బాగానే అలరిస్తుంది. కానీ ఆమె పాత్రలోనూ ఏ ప్రత్యేకతా లేదు. ఆమెను ముందు పెట్టి సినిమాను సేల్ చేసే వ్యవహారం లాగా అనిపిస్తుంది ‘డోర’ తీరు చూస్తే. ట్రైలర్ అదీ చూసే ఎంతో ఆశిస్తాం కానీ.. ‘డోర’ ఆ అంచనాల్ని ఓ మోస్తరు స్థాయిలో కూడా అందుకోదు. కథతో పాటు నరేషన్ అంతా కూడా పాత స్టయిల్లో ఉండటం నిరాశ కలిగిస్తుంది. పైగా కథను మొదలుపెట్టడానికే దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రథమార్ధంలో అసలు కథే లేదు. తమిళ నేటివిటీతో సాగే ఫస్టాఫ్ పూర్తిగా నిరాశ పరుస్తుంది. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించవు. తంబి రామయ్య చేసిన లౌడ్ కామెడీ విసిగిస్తుంది. కారు దయ్యంతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ చాలా రొటీన్ గా ఉంటాయి. హార్రర్ ఎలిమెంట్ ఎలివేట్ చేయడానికి బ్యాగ్రౌండ్ స్కోర్ తో హడావుడి చేశారు కానీ.. అదేమంత వర్కవుట్ కాలేదు.

కారుకు సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏంటో తెలిసే వరకు ‘డోర’ చాలా నత్తనడకన సాగుతుంది. సినిమాలో ఆసక్తి రేకెత్తించే సన్నివేశం ఇదే. ఈ సస్పెన్స్ రివీల్ చేసే సీన్లో మాత్రం దర్శకుడు తన ప్రతిభ చూపించాడు. ఐతే దయ్యం కథేంటో తెలిసిపోయాక మళ్లీ ఆసక్తి సన్నగిల్లిపోతుంది. కథ ఎలా నడవబోయేది.. సినిమా ఎలా ముగియబోయేది అర్థమైపోయాక ఇక ముగింపు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. కాకపోతే కారు హత్యలు చేసే సన్నివేశాల్ని చూడ్డానికి బాగుంటాయి. ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ టీం ప్రతిభ కనిపిస్తుంది. కారు చేసే విన్యాసాలు అవీ ఒకప్పటి ‘కారు దిద్దిన కాపురం’.. ‘కారా మజాకా’ లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. ఐతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే.. విజువల్ ఎఫెక్ట్సే. కుక్కకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ బాగానే అనిపిస్తుంది కానీ.. మళ్లీ వర్తమానం లోకి వచ్చాక రొటీన్ గా సాగే రివెంజ్ స్టోరీ నిరాశ పరుస్తుంది. ఓవరాల్ గా ‘డోర’ ఒక సగటు రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగే హార్రర్ మూవీనే.

నటీనటులు:

నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆమే. పాత్రలో ఏమంత ప్రత్యేకత లేకపోయినప్పటికీ నయన్ నటన ఆకట్టుకుంటుంది. ఐతే ‘మయూరి’ లాంటి సినిమా తర్వాత నయన్ ఇలాంటి కథకు ఓకే చెప్పడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. హీరోయిన్ తండ్రి పాత్రలో తంబిరామయ్య చేసిందేం లేదు. ఆయన చేసే లౌడ్ కామెడీ.. ఆ హావభావాలు  తమిళ నచ్చవచ్చేమో కానీ.. మనవాళ్లు తట్టుకోలేరు. హరీష్ ఉత్తమన్ బాగానే చేశాడు. విలన్ పాత్ర చేసిన సులైల్ కుమార్ పర్వాలేదు. సినిమాలో మిగతా పాత్రలకేమీ అంత ప్రాధాన్యం లేదు.

సాంకేతిక వర్గం:

‘డోర’కు వివేక్ శివ.. మెర్విన్ సాల్మన్ అనే ఇద్దరు సంగీత దర్శకులు కలిసి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో పాటల గురించేమీ చెప్పుకోవడానికి లేదు. నేపథ్య సంగీతం ఓకే. కొన్ని చోట్ల శబ్దాలు మరీ ఎక్కువైనట్లు అనిపించినప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. దినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ టీంకు అభినందనలు తెలపాలి. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం గొప్ప విషయమే. ఇక దర్శకుడు దాస్ రామస్వామి.. కథ విషయంలో కొత్తగా ఏమీ ఆలోచించలేదు. కారుని.. కుక్కని ప్రధాన పాత్రలు చేయడంలో భిన్నంగా ఆలోచించాడు కానీ.. మిగతా అంతా రొటీన్ గా నడిపించేశాడు. అతడి నరేషన్ కూడా ఓల్డ్ స్టయిల్లో సాగింది.

చివరగా: డోర.. అదే దయ్యం.. అదే ప్రతీకారం!

రేటింగ్-2/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News