రాజా దీపావళికి రావడం ఖాయమేనా!

Update: 2017-10-10 08:23 GMT
కొద్దిగా గ్యాప్ తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు మాస్ రాజా రవితేజ. సుప్రీమ్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ బ్లైండ్ పర్సన్ గా నటించాడు. మెహరిన్ హీరోయిన్ - ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన రాజా ది గ్రేట్ ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. దీంతో రవితేజ అభిమానుల్లో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడాయి. అందుకు తగ్గట్లుగానే పండుగ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి అలానే అభిమానుల ఉత్కంఠని తెరదించేందుకు దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా దీపావళికి రాకపోవచ్చని సినీ జనాలు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడమే దానికి కారణం అని వినిపిస్తోంది. సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్లో ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలి ఉన్నట్లుగా తెలిసింది. అలానే రవితేజ - మెహరిన్ తదితరులు పై కొన్ని షాట్స్ తీయాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం మెహరిన్ ఈ సినిమాకు సంబంధించిన షూట్ లోనే పాల్గొంటుందని  చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా అనుకున్న తేదీకే విడుదల అవ్వుతుందా లేక మరో వారం వాయిదా పడే అవకాశం ఉందా అనే సందేహాలు ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు మధ్య వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!
Tags:    

Similar News