ఓజీలోని ఆ స్పెషల్ సాంగ్‌పై తమన్ కామెంట్స్..!
అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లినా ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ అరుస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు', 'ఓజీ' సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీరమల్లు కంటే ఫ్యాన్స్‌లో ఓజీపై క్రేజ్ ఎక్కువగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లినా ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ అరుస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలకు హాజరైన సమయంలోనూ ఓజీ అంటూ అరుస్తున్న నేపథ్యంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఓజీ సినిమాపై ఉన్న బజ్ ను మరింత పెంచే విధంగా సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఓజీలో వచ్చే స్పెషల్ పాట గురించి చెప్పుకొచ్చాడు.
ఓజీ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో వచ్చే ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్ అంటూ సాగే పాటను తమిళ్ స్టార్ హీరో శింబుతో పాడించారు. తాజా ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. సినిమాలోని అద్భుతమైన సన్నివేశం సమయంలో ఆ పాట వస్తుందని, ఆ పాట సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుంది అంటూ తమన్ పేర్కొన్నారు. ఈ పవర్ ఫుల్ ట్రాక్‌ని శింబు పాడటం వల్ల మరింతగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓజీ సినిమా నుంచి ఈ పాట ఎప్పుడు వచ్చేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఈ ఏడాదిలోనే ఓజీ సినిమాను విడుదల చేస్తామంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు సాహో సుజీత్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను పవన్ కళ్యాణ్‌తో రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ను మాఫియా నేపథ్యంలో చూసిందే లేదు. అందుకే ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాబోతున్న సినిమాలు కావడంతో వీరమల్లు, ఓజీ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓజీ సినిమాలో పవన్ మార్క్ మ్యానరిజంతో పాటు, దర్శకుడు సుజీత్ మార్క్ స్టైలిష్ మేకింగ్ ఉంటుందని, అందుకే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక వీరమల్లు సినిమా విషయానికి వస్తే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి అవుతుంది. రెండు పార్ట్‌లుగా ఓజీ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరమల్లు సినిమా నుంచి మొదటి పాటను నిన్న విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. పాటలు విడుదల కాబోతున్న నేపథ్యంలో వీరమల్లు ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను ఈ రెండు సినిమాలు అందుకుంటాయా అనేది చూడాలి.