'పుష్ప 2' సినిమాపై కామెంట్స్.. రాజేంద్రప్రసాద్ క్లారిటీ!
‘షష్టిపూర్తి’ ప్రెస్‌మీట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'పుష్ప 2' చిత్రంలో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని అన్నారు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ‘హరికథ’ ఈవెంట్‌లో "వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో" అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజుల్లో సినిమాల్లోని హీరో పాత్రలను ఉద్దేశిస్తూ.. ''పుష్ప 2: ది రూల్'' సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ ను ఆయన ప్రస్తావించారు. అయితే అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ట్రోల్ చేశారు. దీనిపై రాజేంద్రప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన స్పందించారు.
‘షష్టిపూర్తి’ ప్రెస్‌మీట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'పుష్ప 2' చిత్రంలో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని అన్నారు. "మొన్న నేనూ అల్లు అర్జున్ కలిసి కూర్చున్నప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాం. 'అంకుల్.. మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు' అని బన్నీ నాతో అన్నాడు. 'పిచ్చోడా.. నేనే అన్నానురా బాబూ' అని చెప్పాను. దీంతో 'అయినా మీరు అన్నది ఆ ఉద్దేశంతో అయ్యుండదులే' అని అన్నాడు. అవును.. నేను అన్న ఉద్దేశ్యం అది కాదు" అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
"ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైంది అంటే.. ప్రతీ దాన్ని నెగిటివ్ యాంగిల్ లోనే చూస్తున్నారు. 'నేను చెప్పింది ఏంటి? మీరు రాసింది ఏంటి?' అని నాకు బాగా చనువు ఉన్న ఒకతన్ని పట్టుకొని అడిగాను. 'టైటిల్ అలా పెట్టకపోతే ఎవడూ చూడటం లేదు అన్నయ్యా' అని చెప్పాడు. టైటిల్ అలా వుంటుంది కానీ, దాంట్లో ఏమీ ఉండదు. నేను సోషల్ మీడియాలో వచ్చే అన్నిటినీ ఫాలో అయ్యేవాడిని కాదు. నేనెప్పుడూ ఎవరి గురించీ నెగిటివ్ గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా హీరో హీరోయిజం గురించి మాట్లాడుతూ.. లేడీస్ టైలర్ హీరోనా? వాడు ఎదవ అన్నాను. నన్ను నేనే అనుకున్నాను" అని రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు.
పుష్ప 2' ట్రోల్స్ పై రాజేంద్ర ప్రసాద్ ఇంతకముందు ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తన బిడ్డ లాంటి వాడని, అతనిపై నెగెటివ్ గా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. సమాజంలో మన పక్కనున్న క్యారెక్టర్స్‌ని హీరోగా తీసుకుని, ఆ క్యారెక్టర్ ద్వారానే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చానని చెప్పారు. అల్లు అర్జున్ నాకు కొడుకు లాంటోడు. బన్నీ నన్ను పిచ్చగా ప్రేమిస్తాడు. అతను నన్ను ఎంత లవ్ చేస్తాడనేది మాటల్లో చెప్పలేను. నేను కూడా అంతే లవ్ చేస్తాను. ఇద్దరం కలిసి 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపుములో' సినిమాలు చేశాం. అసలు 'పుష్ప 2' లాంటి సినిమా తీయడం ఎవరికి సాధ్యం కాదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఎంతో సంతోషపడిపోయా అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఇకపోతే రాజేంద్రప్రసాద్, అలనాటి నటి అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ‘షష్టిపూర్తి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 'లేడీస్ టైలర్' తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమిది. పవన్ ప్రభాస్ దర్శకత్వంలో రుపేశ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్ లోనే 'పుష్ప 2' ట్రోలింగ్ పై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.