సూపర్‌స్టార్ నాశనం అవ్వాలని కోరుకున్న ఇండస్ట్రీ?
షారూఖ్ ఖాన్ తో తాను తెరకెక్కించిన రా-వన్ సినిమా పరాజయం వెనక కారణాలను విశ్లేషించిన అనుభవ్ ఊహించని విధంగా నెపం పరిశ్రమ పైకి నెట్టాడు.
హైదరాబాద్ లో తెలుగు సినీపరిశ్రమను నిలబెట్టడంలో 10 మంది టాప్ స్టార్ల పేర్లను సూచించాలని కోరితే, టాలీవుడ్ లెజెండ్స్ ఎన్టీఆర్- ఏఎన్నార్-కృష్ణ- శోభన్ బాబు- కృష్ణంరాజు- మురళీమోహన్- చిరంజీవి-బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్ వంటి ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. దశాబ్ధాల పాటు నటులుగా వారు చేసిన సేవలు, అంకితభావం గురించి మాట్లాడుతారు.
అలాగే బాలీవుడ్‌ని నిలబెట్టడంలో టాప్ -10 స్టార్ల పేర్లను సూచించాలని కోరితే, అందులో లెజెండ్స్ రాజ్ కపూర్, దేవానంద్, అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా- దిలీప్ కుమార్, ధర్మేంద్ర- జితేంద్ర, అమితాబ్ బచ్చన్ లతో పాటు ఖాన్ ల త్రయం షారూఖ్ - సల్మాన్- అమీర్ ఖాన్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తాయి. అయితే ఇలాంటి దిగ్గజాలలో ఒకరైన షారూక్ ఖాన్ నాశనం అవ్వాలని బాలీవుడ్ కోరుకుంటుందా? .. అంటే ఒకానొక దశలో ఇండస్ట్రీ కోరుకుందని సంచలన వ్యాఖ్యలు చేసారు ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా. షారూఖ్ ఖాన్ తో తాను తెరకెక్కించిన రా-వన్ సినిమా పరాజయం వెనక కారణాలను విశ్లేషించిన అనుభవ్ ఊహించని విధంగా నెపం పరిశ్రమ పైకి నెట్టాడు.
సైన్స్-ఫిక్షన్ సూపర్ హీరో చిత్రం `రా.వన్` పరాజయంలో పరిశ్రమ వర్గాల సైలెన్స్, ప్రమఖుల్లో కొందరి ఆలోచన కీలక పాత్ర పోషించిందని అనుభవ్ అన్నాడు. ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో కమర్షియల్ విజయాలు సాధించిన అనుభవ్ సిన్హా `రా.వన్` ఫ్లాపవ్వడం వెనక సృజనాత్మక గందరగోళం సహా పరాజయానికి తాను బాధ్యత వహిస్తానని అన్నాడు.
2011లో విడుదలైన రా.వన్ భారతదేశంలో హై స్టాండార్డ్ సాంకేతికతతో రూపొందించిన సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యాధునిక VFX - చార్ట్‌బస్టర్ సౌండ్‌ట్రాక్ లతో ఆకట్టుకున్నా రా.వన్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించలేకపోయింది. దానికి కారణం స్క్రిప్ట్ లోపభూయిష్టంగా ఉంది. ఎడిటింగ్ సరిగా లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ కథతో చేసిన ప్రయత్నం చివరికి సినిమాను దెబ్బతీసింది అని అనుభవ్ నిజాయితీగా అంగీకరించాడు. అయితే సినిమా కోసం ఎంచుకున్న థీమ్ లైన్ ఎంతో గొప్పదని అతడు ఇప్పటికీ నమ్ముతాడు.
సినిమా కష్టాలకు తోడు పరిశ్రమలో ప్రతికూలత అంతర్లీనంగా పరాజయం వెనక పని చేసిందని కూడా అనుభవ్ అన్నారు. రెండవ వారం నాటికి, సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదని నేను గ్రహించాను. నేను నిరాశకు గురయ్యాను. నేను లండన్‌లో కిషోర్ లుల్లాతో మాట్లాడాను.. సినిమా థియేటర్లలో అంతగా ఆడకపోయినా, షారుఖ్ ఖాన్ తమ పెట్టుబడిని తిరిగి పొందుతారని అతడు నాకు హామీ ఇచ్చాడు! అని గుర్తుచేసుకున్నాడు.
కానీ అనుభవ్‌ను కలచి వేసిన విషయం బాలీవుడ్‌లో నిశ్శబ్ద వ్యతిరేకత. షారుఖ్ ఖాన్ విఫలమవ్వాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు. నేను దానిని గ్రహించానని ఆయన అన్నారు. చివరకు షారుఖ్ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నప్పుడు నా హృదయం తీవ్రంగా గాయపడింది. సినిమాను, అతడి నమ్మకాన్ని మోసం చేసినట్లు నాకు అనిపించింది. షారూఖ్ గర్వించదగిన సినిమాను నేను అందించలేకపోయానని కలత చెందాను.. అని అనుభవ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
2011లో రా.వన్ విడుదలైనప్పుడు, హాలీవుడ్ సూపర్ హీరోలకు భారతదేశం నుంచి ఇది సమాధానంగా నిలుస్తుందని భావించారు. ఈ చిత్రం ఏఐ-ఆధారిత గేమ్ తో విలన్ రా.వన్‌ను సృష్టించే శాస్త్రవేత్త కథ. అతడు చివరికి ప్రాణం పోసుకుని విధ్వంసం సృష్టిస్తాడు. సంచలనాత్మక విజువల్ ఎఫెక్ట్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి సౌండ్‌ట్రాక్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేసారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. సినిమాలో ఏదో మిస్సయింది. ఎమోషన్ కనెక్టవ్వలేదు. దీంతో దారుణంగా ఫెయిలైంది. చివరికి రా.వన్ భారతదేశంలో సాహసోపేతమైన ప్రయోగంగా మిగిలిపోయింది.