మెగాస్టార్ చిరంజీవికి యాంకర్ శ్యామల ప్రశ్న
ఇది క్షణాల్లో ఇంటర్నెట్ లో బిగ్ డిబేట్ కి తెర తీసింది.
ఓ పబ్లిక్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి స్త్రీ- పురుష లింగ భేధం గురించి ప్రస్థావిస్తూ.. వారసత్వాన్ని కొనసాగించడానికి కొడుకు అవసరమని అనడం నెటిజనుల్లో చర్చనీయాంశమైంది. తన ఇంట్లో తన మనవరాళ్లు అయిన అమ్మాయిలే తన చుట్టూ ఉన్నారని, చరణ్ కి రెండో బిడ్డగా మగ పిల్లాడు పుడితే బావుంటుందని కోరుకుంటున్నానని చిరు వ్యాఖ్యానించారు. ఇది క్షణాల్లో ఇంటర్నెట్ లో బిగ్ డిబేట్ కి తెర తీసింది.
ముఖ్యంగా అబ్బాయి అయితేనే లెగసీని ముందుకు తీసుకెళతాడా? ఆడ పిల్లలు ఆ పని చేయలేరా? ఎందుకు తక్కువ చేసి మాట్లాడారు? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. టీవీ యాంకర్ కం నటి శ్యామల ఇది చాలా పాత కాలం నాటి ఆలోచన అని విమర్శించారు. మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్న నేటి ప్రపంచంలో, అలాంటి నమ్మకాలు పాతవిగా అనిపిస్తున్నాయని తప్పు పట్టారు. చిరంజీవి కుటుంబంలోనే ఆయన కోడలు ఉపాసన ఒక విజయవంతమైన వ్యవస్థాపకురాలు అని.. కుమార్తెలు కూడా వారసత్వానికి మార్గదర్శకులుగా ఉండగలరని శ్యామల వ్యాఖ్యానించారు. కుమార్తెలు కుటుంబ విలువలను నిలబెట్టగలరని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని శ్యామల బలంగా చెప్పడాన్ని పలువురు ప్రశంసించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మనవడు కావాలనే మాటను చాలా ఫన్నీ వేలో అనడం వేదిక వద్ద ఉన్నవారు గమనించినదే. చిరు ఓ సరదా సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేసారు. ఆయనకు ఆడవారంటే గౌరవం ఉంది. తన కుటుంబంలోని ఆడవారందరినీ చిరు గౌరవించే తీరు ఎప్పుడూ ఆదర్శనీయం. అయితే కొడుకు మాత్రమే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలడు! అనే మాట పూర్తిగా పాత జనరేషన్ కి సంబంధించినది. నేడు మహిళ ఎంత అడ్వాన్స్ డ్ గా ఎదుగుతున్నారో చూస్తున్నదే. నేటి జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు.. తండ్రి వారసత్వం-లెగసీ మ్యాటర్‌లో, ఆస్తుల సమానత్వంలోను అస్సలు తగ్గడం లేదు.