‘బిగ్ బాస్’లో డ్రామా పండించేశారుగా..

Update: 2017-07-19 08:02 GMT
‘బిగ్ బాస్’ రియాల్టీ షో మొదలవడానికి ముందు ఇది ఏమేరకు విజయవంతం అవుతుందో అన్న సందేహాలు గట్టిగానే వినిపించాయి. హోస్ట్ గా వారాంతాల్లో ఎన్టీఆర్ ఎంత బాగా షోను నడిపించినా.. మిగతా ఐదు రోజుల్లో పార్టిసిపెంట్లు ఆసక్తిని నిలిపి ఉంచగలరా.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలరా అన్న అనుమానాలు నెలకొన్నాయి. హిందీలో ‘బిగ్ బాస్’ విజయవంతం కావడానికి అక్కడ పెద్ద పెద్ద సెలబ్రెటీలు రావడం.. ‘బిగ్ బాస్’ హౌస్ లోపల అనేక ఎఫైర్లు.. వివాదాలు.. డ్రామాలు నడవడం ప్రధాన కారణం. మరి తెలుగు పార్టిసిపెంట్లు ఇలా షోను రక్తి కట్టించగలరా అన్నది సందేహంగా మారింది. ఐతే తెలుగు బిగ్ బాస్ పార్టిసిపెంట్లలో అంత ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్న వాళ్లు పెద్దగా లేరు కానీ.. షోను నాటకీయంగా నడిపించడానికి కొంత ప్రయత్నమైతే జరుగుతోంది.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును తొలి వారానికి ‘బిగ్ బాస్’ హౌస్ లీడర్ గా ఎంపిక చేయడం మంచి ఎత్తుగడ అయితే.. సంపూ అండ్ గ్యాంగ్ వెళ్లి స్మోకింగ్ జోన్లో ఒకేసారి దమ్ము కొట్టడం.. వారికి ‘బిగ్ బాస్’ వార్నింగ్ ఇవ్వడం.. ఎలిమినేషన్ కోసం కౌంట్ డౌన్ మొదలవడం తొలి రోజు ఆసక్తి రేకెత్తించాయి. ఇక రెండో రోజు విషయానికొస్తే.. ఒక చిన్న డ్రామా అందరి దృష్టినీ ఆకర్షించింది. తొలి సీజన్లో మోస్ట్ కాంట్రవర్శల్ పార్టిసిపెంట్ అవుతాడని భావిస్తున్న ఆదర్శ్.. తనకేదో అయిపోయినట్లుగా భ్రమలు కల్పించి.. ధన్ రాజ్ ను కొరికేసి.. లోపల గదిలోకి వెళ్లి వస్తువుల్ని చిందరవందరగా పడేసి.. నానా రచ్చ చేశాడు. ఓ దశలో అతడికి ఏమైందో అన్న కంగారు కలిగించాడు. కానీ చివరికది డ్రామా అని తేలింది. ఇప్పటికే రియాల్టీ షోల్లో ఇలాంటి డ్రామాలు చాలా చూశాం. ‘బిగ్ బాస్’ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటకీయత జోడించేశారు. దీంతో రెండో రోజు షోకు మంచి రేటింగ్సే వచ్చాయంటున్నారు. మరి మున్ముందు ఈ షోలో ఇలాంటి డ్రామాలు ఇంకెన్ని ఉంటాయో చూద్దాం.
Tags:    

Similar News