మేజర్ కి వర్కౌట్ అయ్యింది.. మరి ఈ సినిమాకి వర్కౌట్ అయ్యేనా?

Update: 2022-09-18 13:53 GMT
సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్న మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈసారి హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ఆర్ బాల్కీ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం చుప్‌ 23వ తారీకు పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు మీడియా సమావేశాలు... ఇంటర్వ్యూలతో యూనిట్‌ సభ్యులు సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చేలా చేశారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు సినిమా ను విడుదలకు ముందు మరింతగా జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు గాను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇటీవల అడవి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్ సినిమా ను విడుదలకు వారం రోజుల ముందే పలు ఏరియాల్లో ప్రీమియర్ చేసిన విషయం తెల్సిందే. ఆర్మీ వారితో పాటు పలు రంగాల వారికి కూడా సినిమా ను ప్రత్యేక షో లు వేసి చూపించిన విషయం తల్సిందే. సినిమాకు అది కచ్చితంగా మంచి చేసిందనే చెప్పాలి.

ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ వ్యూహాలను చుప్‌ సినిమా యొక్క ప్రమోషన్‌ కి అన్వయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని పలు ముఖ్య నగరాలు మరియు పట్టణాల్లో సినిమా కు ప్రీమియర్ షో లు వేయబోతున్నారట. సెప్టెంబర్‌ 20వ తారీకున ఈ సినిమాను మీడియా తో పాటు పలు వర్గాల వారికి ప్రీమియర్ లు వేయబోతున్నారు.

ముంబై.. హైదరాబాద్.. గుర్గావ్.. బెంగళూరు.. పూణే.. ఢిల్లీ.. అహ్మదాబాద్.. లక్నో.. జైపూర్ మరియు కోల్‌కత ల్లో ప్రీమియర్ లకు ఏర్పాట్లు జరిగినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రీమియర్ లతో సినిమాకు మరింతగా ప్రమోషన్‌ అవ్వబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. 
Tags:    

Similar News