అవునో తెలియదు.. స్లోగా సాగే మంచివాడి మెలోడి

Update: 2019-12-19 10:03 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎంత మంచివాడవురా'.  ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా మెహ్రీన్ పీర్జాదా నటిస్తోంది.  గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.  సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి.  తాజాగా ఈ సినిమా నుంచి 'అవునో తెలియదు' అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ పాటకు సాహిత్యం అందించినవారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శ్రేయ ఘోశల్ ఈ పాటను పాడారు. "అవునో తెలియదు కాదో తెలియదు ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా వయసుకు మెళకువ రాలేదా" అంటూ హీరోయిన్ తన మనసులోని భావాలను మాటలుగా చేసి హీరో కోసం పాడుకునే సందర్భం.  ఎప్పటిలాగే సిరివెన్నెల పద ప్రయోగాల మ్యాజిక్ ఇందులో కూడా కనిపిస్తుంది.  "చెలిమంటే తమరికి చేదా తగు వరసై వస్తున్నాగా" అంటూ చలి మంట తరహాలో చెలి మంట పదం ప్రయోగించారు.  'మంచివాడు' చెలి మంటకు దూరంగా  ఉంటున్నాడని చెప్పకనే చెప్పారు సిరివెన్నెల.  ఈ "చెలిమంటే" పదంలో ద్వంద్వార్థం ఉంది.  'చెలిమి అంటే' తమరికి చేదా..  ప్రియురాలి స్నేహం వద్దా అనేది ఒక భావం.  రెండోది 'చెలి మంటే' తమరికి చేదా అనేది.. చెలి వల్ల పుట్టే మంట.  ఇది ప్రియురాలు ఉన్న మహాత్ములకు.. జ్ఞానులకు చిటికెలో అర్థం అయ్యే భావం. అది లేని వాడికి వేడి లేదు.. మంట లేదు. ఇలాంటివి ఇంతకంటే వివరించడం కష్టం.  సో.. ఎప్పటి లాగే సిరివెన్నెల తనదైన శైలిలో సాహిత్యం అందించారు.

ఇక శ్రేయా ఘోశల్ కూడా ఎంతో మెలోడియస్ వాయిస్ తో ఈ పాటను పాడారు. హిందీ సింగర్ అయినప్పటికీ స్పష్టమైన ఉచ్ఛారణ తో పాడడం నిజంగా గొప్ప విషయమే. గోపీ సుందర్  ట్యూన్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అని చెప్పలేం.  బాగుంది కానీ చాలా స్లో గా ఉంది.  మెలోడీ ప్రేమికులకు నచ్చుతుంది కానీ సాధారణ తీన్ మార్ ప్రియులకు కనెక్ట్ కావడం కష్టమే. పాటలో ఉన్న కళ్యాణ్ రామ్-మెహ్రీన్ విజువల్స్  అందంగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం మంచి పాట.  ఆలస్యం ఎందుకు.. వినేయండి.

Full View


Tags:    

Similar News