త‌న‌యుడి కోసం తండ్రి టెర్రిఫిక్ ప్లాన్‌!

Update: 2022-10-11 00:30 GMT
హీరోల వార‌సులకు టాలీవుడ్ లో కొద‌వ లేదు. ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు హీరోలుగా రాణిస్తుంటో మ‌రి కొంత మంది స్టార్ డ‌మ్ కోసం ప్ర‌య‌త్నాలు చేప్తున్నారు. కొంత మంది ఇప్పుడిప్పుడే త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ హీరో త‌న త‌న‌యుడిని హీరోగా నిల‌బెట్ట‌డం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌నే శ్రీ‌కాంత్‌. హీరోగా ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్న శ్రీ‌కాంత్ ప్ర‌స్తుతం ప్రాధాన్య‌త వున్న కీల‌క పాత్ర‌లో పాటు హీరోగానూ రాణిస్తున్నారు.

ఇదే క్ర‌మంలో త‌న త‌న‌యుడు రోష‌న్ ని హీరోగా నిల‌బెట్ట‌డం కోసం టెర్రిఫిక్ ప్లాన్ తో ముందుకెళుతున్నారు.  కొన్నేళ్ల క్రితం 'నిర్మాలా కాన్వెంట్‌' హీరోగా ప‌రిచ‌య‌మైన రోష‌న్ కు తొలి ప్ర‌య‌త్నం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ సినిమాపై ఫ‌లితంపై స్వ‌యంగా శ్రీ‌కాంత్ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రోష‌న్ హీరోగా చేసిన సెకండ్ మూవీ 'పెళ్లిసంద‌D'.

గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓకే అనిపించింది. అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోయిన్ శ్రీ‌లీల ఖాతాలోకే వెళ్లిపోవ‌డంతో రోష‌న్ కు పేరు తెచ్చి త‌న‌ని హీరోగా నిల‌బెట్టే ప్రాజెక్ట్ కోసం గ‌త కొన్ని రోజులుగా అన్వేషించిన శ్రీ‌కాంత్ ఎట్ట‌కేల‌కు రోష‌న్ కోసం భారీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ల‌ని లైన్ లో పెట్టేశాడు. 'పెళ్లిసంద‌D' త‌రువాత రోష‌న్ తో సినిమాలు చేయ‌డానికి మూడు భారీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు రెడీ అవుతున్నాయి.

వైజ‌యంతీ మూవీస్ లో ఓ ప్రాజెక్ట్, ఏషియ‌న్ బ్యాన‌ర్ లో ఓ మూవీ, గీతా ఆర్ట్స్ లో ఓ మూవీతో పాటు మ‌రిన్ని క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల్లో బ్యాక్ టు బ్యాక్ రోష‌న్ సినిమాలు చేయ‌బోతున్నాడ‌ట‌. ఇందులో ముందుకు 'సీతారామం' వంటి ఎపిక్ ల‌వ్ స్టోరీ తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న వైజ‌యంతీ మూవీస్ లో రోష‌న్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంది.

త‌న‌యుడు రోష‌న్ ని హీరోగా నిల‌బెట్టి స్టార్ ని చేయాల‌ని శ్రీ‌కాంత్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత స‌క్సెస్ అవుతాయో.. వాటిని రోష‌న్ ఎంత వ‌ర‌కు స‌ద్వినియోగం చేసుకుని తండ్రి పెడుతున్న ఎఫ‌ర్ట్ కు న్యాయం చేస్తాడో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ లు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందేన‌ని ఇన్ సైడ్ టాక్‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News