గొప్ప‌ల‌కు పోయారు..భారీ మూల్యం చెల్లించారు!

Update: 2022-12-30 23:30 GMT
టాలెంట్ కు మాత్ర‌మే పెద్ద పీట వేసే ఇండ‌స్ట్రీలో మాట పొదుపుగా వాడాలి. పొర‌పాటున తెలిసో తెలియ‌కో  టంగ్ స్లిప్ప‌య్యామా.. అంతే సంగ‌తులు. ఇక్క‌డ ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా న‌వ్వుతూనే స‌మాధానం చెప్పాలి. పేషెన్సీతో వ్య‌వ‌హ‌రించాలి. అలా కాకుండా మాట‌కు మాట‌.. ప‌బ్లిక్ గా అంటే మాత్రం ఇక్క‌డ భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. హిపోక్ర‌సీ రాజ్య‌మేలే ఇండ‌స్ట్రీ కాబ‌ట్టి ప్ర‌తీ విష‌యాన్ని ఈజీగా తీసుకోవాలి. కోప‌తాపాల‌కు వెళ్ల‌కూడదు. మ‌రో టాపిక్ ని అస‌లే ట‌చ్ చేయ‌కూడ‌దు. యార‌గెన్సీని ప్ర‌ద‌ర్శిస్తే ఇక్క‌డ ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వు.

ఈ ఏడాది న‌లుగురు యంగ్ డైరెక్ట‌ర్స్ తెలిసి కొంత మంది.. తెలియ‌క మ‌రి కొంత మంది తాము చేసిన పొర‌పాటు కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్ప‌లేదు. ఈ న‌లుగురు డైరెక్ట‌ర్ల‌లో ముందు వ‌రుస‌లో హాట్ టాపిక్ గా మారిన డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. నితిన్ హీరోగా రూపొందిన 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' మూవీతో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈ మూవీ రిలీజ్ కు ముందు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రిగిన హంగామా అంతా ఇంతా కాదు. త‌ను సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ వేశాడో లేదో తెలియ‌దు కానీ త‌నే ట్వీట్ చేశాడ‌ని పెద్ద దుమార‌మే రేగింది.

దీంతో అత‌ను డైరెక్ట్ చేసిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. తాను ఆ ట్వీట్ లు చేయ‌లేద‌ని, కావాల‌నే ఎవ‌రో త‌న పేరు చెడ‌గొట్టాల‌నే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నార‌ని సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించినా ఫ‌లితం లేకుండా పోయింది. నితిన్ రంగంలోకి దిగి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఈ వివాదం కార‌ణంగా 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' వార్త‌ల్లో నిలిచినా ఫైన‌ల్ గా డిజాస్ట‌ర్ అనిపించుకుని డైరెక్ట‌ర్ కు షాకిచ్చింది.

ఇక ఇదే త‌ర‌హాలో మ‌రో ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వకు కూడా ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న డైరెక్ట్ చేసిన మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీ రిలీజ్ కు ముందు మీడియా వేదిక‌గా ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా రివ్యూ రైట‌ర్స్ పై, సోష‌ల్ మీడియాలో మినీ రివ్యూలు పోస్ట్ చేసేవారిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే సినిమాలో విష‌యం లేక‌పోవ‌డం, ద‌ర్శ‌కుడు చేసిన వ్యాఖ్య‌లు కొంత మందిని హ‌ర్ట్ చేయ‌డంతో 'రామారావు ఆన్ డ్యూటీ' భారీ డిజాస్ట‌ర్ అనిపించుకుంది.

ఇక వీరి త‌ర‌హాలోనే మ‌రో ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ కూడా వ‌చ్చిన అవ‌కాశాన్ని అనుకున్న విధంగా వుప‌యోగించుకోలేక స్వ‌యంగా హీరో ర‌వితేజ‌తో విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూవీ 'ఖిలాడీ'. కోనేరు స‌త్య‌నారాయ‌ణ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో ర‌వితేజ దర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌పై సెటైర్లు వేయ‌డం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ర‌వితేజ కెరీక్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది.

ఇక నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన 'అంటే సంద‌రానికి' మూవీకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం..ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం తెలిసిందే. ఈ మూవీ ఆక‌ట్టుకోలేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నిడివి. ఇంత అవ‌సరం లేద‌ని వారించినా వివేక్ ఆత్రేయ విన‌లేద‌ట‌. అదే సినిమాకు ప్ర‌ధాన మైన‌స్ గా మారింది. ఇలా ఈ ఏడాది కొంత మంది ద‌ర్శ‌కులు గొప్ప‌ల‌కు పోయి తిప్ప‌లు తెచ్చుకున్నారు. డిజాస్ట‌ర్ల‌ని ద‌క్కించుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News