సేవ్ సినిమా #సేవ్ థియేట‌ర్స్! సినిమాటోగ్ర‌ఫీ మంత్రిని క‌లిసిన ఫిలింఛాంబ‌ర్!!

Update: 2021-07-17 12:30 GMT
#సేవ్ సినిమా #సేవ్ థియేట‌ర్స్! నినాదంతో తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఉద్య‌మం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్లు మ‌నుగ‌డ సాగిస్తేనే సినిమా రంగం మ‌నుగ‌డ సాగిస్తుంద‌నేది ఈ నినాదం సారాంశం. ఇప్ప‌టికే ఈ ఉద్య‌మం తాలూకా డిమాండ్ల‌తో విన‌తిప‌త్రాన్ని సిద్ధం చేసి కొంత‌కాలంగా ప్ర‌భుత్వానికి నివేదిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు గౌరవ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి  తలసాని శ్రీ‌నివాస యాద‌వ్ తో సమావేశమై థియేటర్లను ప్రారంభించటానికి మెమోరాండం సమర్పించారు. ఎఫ్‌.డి.సి కిషోర్ బాబు- సునీల్ నారంగ్ - అభిషేక్ నామా- అనుపమ్ రెడ్డి- సదానంద్ గౌడ్- గోవిందర్ రాజ్ త‌దిత‌రులు మంత్రివ‌ర్యుల‌ను క‌లిసిన వారిలో ఉన్నారు.

గ‌డిచిన తొమ్మిది నెల‌ల కాలంలో క‌రోనా వ‌ల్ల థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. ఎగ్జిబిష‌న్ పంపిణీ రంగాలు స‌హా నిర్మాత‌లు తీవ్రంగా దెబ్బ తిని ఉన్నారు. క్రైసిస్ కాలంలో త‌మ‌కు తీవ్ర న‌ష్టం త‌ప్ప‌లేద‌ని.. అయితే దానికి ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని తెలంగాణ పంపిణీదారుల ఎగ్జిబిట‌ర్ల సంఘాలు కోరుతున్నాయి. వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తులు ఉన్నా.. క్రైసిస్ కాలంలోని క‌రెంటు బిల్లుల్ని రద్దు చేసి.. పార్కింగ్ ఫీజుల‌కు ఇప్పుడు అనుమ‌తించాల‌ని ఇంత‌కుముందు తీర్మానించారు.

ఇటీవ‌ల తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న అన్ని జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు త‌మ‌ డిమాండ్లతో ఒక మెమోరండం త‌యారు చేశారు. ఈ స‌మావేశంలోనే టిక్కెట్టు ధ‌ర పెంపు విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదనంగా షో లు ప్రదర్శించేందుకు డిసెంబర్ లో ఇచ్చిన జీవోను వెంటనే అమల్లోకి తేవాలని టీ-పంపిణీ వ‌ర్గాలు కోరుతున్నాయి.

మెమోరండం సారాంశ‌మిదీ..

ఏడాదిన్న‌ర కాలంగా ఈ రంగంలో సందిగ్ధ‌త అలానే ఉంది. 24 శాఖ‌ల కార్మికుల ఉపాధితో పాటు థియేట‌ర్ రంగంలోని వేలాది మంది ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయింది. థియేట‌ర్లు మూసివేయ‌డంతో ఇప్ప‌టికీ ఈ రంగంలో బ‌తుకు తెరువు లేక అల్లాడుతున్నారు.

``సేవ్ సినిమా.. సేవ్ థియేట‌ర్స్`` నినాదం ఉద్ధేశ‌మేమిటంటే సినీరంగాన్ని కాపాడాల‌న్నా థియేట‌ర్ల రంగాన్ని నిల‌బెట్టాల‌న్నా ప్ర‌భుత్వం నుంచి కొన్ని వెసులుబాట్లు కావాల‌ని మెమోరండంలో పేర్కొన్నారు. జీవో నంబ‌ర్ 75 ని పునఃప‌రిశీలించాల‌ని వెంట‌నే థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజుల‌ను వ‌సూలు చేసేందుకు అనుమ‌తులివ్వాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ ప్ర‌భుత్వాన్ని కోరింది.

నామ‌మాత్ర‌పు ఫీజుల వ‌సూళ్ల‌కు అనుమ‌తులివ్వాల‌ని ఈ మార్పు వ‌ల్ల థియేట‌ర్ కార్మికుల జీతాల చెల్లింపులు స‌హా ఉపాధికి ఆస్కారం ఉంటుంద‌ని ఛాంబ‌ర్ తెలిపింది. ద‌శాబ్ధాల పాటు థియేట‌ర్ల‌ను నిల‌బెట్టింది పార్కింగ్ ఫీజు. దానిని ర‌ద్దు చేసిన జీవోని తిరిగి పునఃప‌రిశీలించాల‌ని కోరారు. ఉచిత పార్కింగ్ వ‌ల్ల థియేట‌ర్లు ఆదాయం కోల్పోతున్నాయి. ప్ర‌స్తుతం కోవిడ్ క‌ష్ట కాలంలో శానిటేష‌న్ కి భారీగా ఖ‌ర్చ‌వుతోంది.. పార్కింగ్ ఫీజుతో కొంత వెసులుబాటు క‌లుగుతుంద‌ని ఆ మెమోరండంలో పేర్కొన్నారు.

లాక్ డౌన్ లో ప్ర‌తి థియేట‌ర్ కి మినిమం డిమాండ్ పేరుతో క‌రెంట్ ఛార్జీల్ని వ‌సూలు చేశారు. కానీ దానిని త‌ట్టుకోవ‌డం క‌ష్టం. తిరిగి ఆ ఛార్జీల‌ను రీఇంబ‌ర్స్ చేయాల‌ని ప్ర‌భుత్వానికి మెమోరండంలో విన్న‌వించారు. రెండేళ్లుగా థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. అందువ‌ల్ల ఈ రెండేళ్ల‌కు ఆస్తి ప‌న్ను ర‌ద్దు చేయాలి. మున్సిప‌ల్ శాఖ దీనిని విధిగా ప‌రిశీలించి సాయ‌ప‌డాలి. అలాగే జీఎస్టీని సాధ్య‌మైనంత త‌గ్గిస్తేనే థియేట‌ర్లు మ‌నుగ‌డ సాగిస్తాయి.

కోవిడ్ క్రైసిస్ కాలానికి అన్నిటినీ ప‌రిశీలిస్తార‌నే ఆశిస్తున్నాం.. అని లేఖ‌లో పేర్కొన్నారు. సినిమాని కాపాడాలంటే .. థియేట‌ర్ రంగం బ‌త‌కాలంటే తెలంగాణ ప్ర‌భుత్వం పైవిధంగా స‌హ‌క‌రించాల‌ని తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆ మెమోరండంలో పేర్కొంది. ఆ మేర‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి తల‌సాని  మెమోరండం ప‌రిశీలించారు. అటు ఏపీలో టిక్కెట్టు రేట్లు పెంచ‌క పోతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెర‌వ‌డం క‌ష్ట‌మేన‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌భుత్వానికి తెలంగాణ ఛాంబ‌ర్ ఓ మెమోరండం పంపించిన సంగ‌తి విధిత‌మే.
Tags:    

Similar News